Sandeshkhali: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ అఘాయిత్యాలపై అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఇటీవల ఉత్తర 24 పరగణాల్లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో రేషన్ కుంభకోణం విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వెళ్తే, వారిపై షాజహాన్, అతని గుండాలు దాడులకు పాల్పడ్డారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ ఘటన నేపథ్యంలో అతని అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ ప్రాంతంలో మహిళలపై షాజహాన్, అతని అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా అతడిని అరెస్ట్ చేయాలని బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.
Read Also: Soniya Gandhi: జైపూర్‌లో రాజ్యసభకు సోనియా నామినేషన్
రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్, మహిళలను పరామర్శించేందుకు ప్రయత్నించిన సమయంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల మధ్య తోపులాటలో మంజుందార్ గాయపడి, స్పృహతప్పి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర బిజెపి చీఫ్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు సందేశ్‌ఖాలీని సందర్శించడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ బసిర్‌హట్‌లోని పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక యంత్రాంగం ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించింది.
సందేశ్‌ఖాలీలో టీఎంసీ కార్యకర్తలు నెలల తరబడి మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు, షేక్ షాహాన్, శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారిని అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరేందుకు వచ్చామని, అరెస్ట్ చేయకపోతే మహిళల పరిస్థితి ఏంటని మంగళవారం మజుందార్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాల కోసం నేరస్తుల్ని కాపాడుతోందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ ప్రశాంత వాతావరణాన్ని పాడుచేస్తోందని, నిరాధార ఆరోపణలు చేస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది.
