Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..

  • కడుపులో సర్జికల్ గ్లోవ్స్, పేపర్ న్యాప్‌కిన్లు..
  • ప్రసవం కోసం వెళ్లిన మహిళకు ప్రాణాపాయం..
  • వైద్యుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల విచారణ..
Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలో బీడ్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి 19 ఏళ్ల యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. సిజేరియన్ ఆపరేషన్ తర్వాత కడుపులో సర్జికల్ గ్లోవ్స్, పేపర్ న్యాప్‌కిన్లు మరిచిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్ర కడుపు నొప్పితో సదరు యువతి పూణేలోని సాసూన్ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది.

సంధ్యా సూరజ్ గైక్వాడ్ ఆగస్టు 1న ప్రసవం కోసం బీడ్ జిల్లా ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే, ఇంటికి వెళ్లిన కొద్దిరోజుల్లోనే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆమె కడుపులో ఏదో తెలియని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో పూణేకు తరలించారు. పూణేలో వైద్యులు ఆపరేషన్ చేసిన కడుపులో సర్జికల్ గ్లోవ్స్, పేపర్ న్యాప్‌కిన్లు తొలగించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఆరోపణలపై బీడ్ జిల్లా యంత్రాంగం స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. సంబంధిత మహిళా వైద్యురాలు, ఇతర ఆరోగ్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆపరేషన్ సమయంలో ఉపయోగించిన వస్తువులు రోగి కడుపులోకి ఎలా వెళ్లాయి.? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులుగా తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.