NTV Telugu Site icon

Bangladesh: పాకిస్తాన్‌ నుంచి భారీగా ఆయుధాలు కొంటున్న బంగ్లాదేశ్.. ఇండియానే లక్ష్యమా..?

Bangladesh

Bangladesh

Bangladesh: రిజర్వేషన్ కోటాని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ ఉన్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత లౌకిక దేశంగా ఉన్న బంగ్లా నెమ్మదిగా ఇస్లామిక్ రాడికల్ పాలన దిశగా వెళ్తోంది. ఇందుకు అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు ఈ ఆరోపణల్ని బలపరుస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ ఆ దేశంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా తన ఆర్మీ కోసం భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను పాకిస్తాన్‌ నుంచి కొనుగోలు చేస్తోంది. పాక్ రక్షణ రంగ సంస్థలు కూడా బంగ్లాదేశ్ ఆర్డర్లను వేగంగా డెలివరీ చేసేందుకు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ఆదేశాలు అందుకున్నాయని తెలుస్తోంది.

Read Also: Article 370: ఆర్టికల్ 370 చరిత్ర, ఎప్పటికీ తిరిగి రాదు: అమిత్ షా..

బంగ్లాదేశ్ సాంప్రదాయకంగా ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో తటస్థ వైఖరిని కలిగి ఉంది. ఈ ప్రాంతంలో బిగ్ ప్లేయర్స్ అయిన భారత్, చైనాలతో సమతుల్యంగా ఉండేది. అయితే, ఇప్పుడు మాత్రం పాక్ నుంచి రక్షణ సామాగ్రి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం భారత్‌ని అలర్ట్ చేసింది. ఈ రక్షణ రంగ ఆర్డర్లు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను సూచిస్తోంది. నివేదికల ప్రకారం.. బంగ్లాదేశ్ 40,000 రౌండ్ల మందుగుండు సామగ్రిని, 2,000 యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామగ్రిని, 40 టన్నుల RDX పేలుడు పదార్థాలను మరియు 2,900 హై-ఇంటెన్సిటీ ప్రొజెక్టైల్‌ని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (POF) నుండి ఆర్డర్ చేసింది. ఈ షిప్‌మెంట్స్ మూడు దశల్లో బంగ్లాకి పాక్ అందివ్వనుంది. సెప్టెంబర్ 2024లో తొలి విడతతో ప్రారంభమై, డిసెంబర్ 2024 వరకు డెలివరీలు పూర్తవ్వనున్నాయి.

బంగ్లాదేశ్ ఇలా ఆయుధాలను కొనుగోలు చేయడంపై భారత్‌కి హెచ్చరిక లాంటిదే. ముఖ్యంగా ఇటీవల కాలంలో బంగ్లాలో భారత వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఆ దేశంలో బీఎన్పీ, జమాతే ఇస్లామీ పార్టీలు ఏకంగా భారత్‌ని హెచ్చరించే స్థాయిలోకి వెళ్లాయి. మరోవైపు పాక్‌కి చేసిన ఆర్డర్లలో సరిహద్దు నుంచి 30 కి.మీ వరకు పేల్చగలిగే ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే బంగ్లా చుట్టూ భారత్ ఉండటం, మన దేశాన్ని టార్గెట్ చేస్తూనే వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌‌తో బంగ్లా రక్షణ సంబంధాలు భారత్‌ని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి.