Bangladesh: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
జేయూడీ నాయకుడు, ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సైఫుల్లా కసూరితో పాటు మరో ఉగ్రవాది ముజమ్మిల్ హష్మీ ఈ వారంలో దీనిపై వ్యాఖ్యానించారు. “1971లో పాకిస్తాన్ ముక్కలైనప్పుడు నాకు నాలుగేళ్లు. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రెండు దేశాల సిద్ధాంతాన్ని బంగాళాఖాతంలో ముంచానని ప్రకటించారు. మే 10న, మేము 1971 ప్రతీకారం తీర్చుకున్నాము” అని కసూరి పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ పేర్కొన్నారు. మరోవైపు, ముజమ్మిల్ హష్మీ కూడా ఇదే విధంగా మాట్లాడుతూ.. తాము భారత నాయకత్వాన్ని బంగ్లాదేశ్‌లో గతేడాది ఓడించామని చెప్పాడు.
Read Also: Shashi Tharoor: కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన శశిథరూర్.. ఏమన్నారంటే..!
1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు, ఆ తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భాగంగా మురిడ్కే (జేయూడి/లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం)పై జరిగిన దాడిలో లష్కరే తోయిబా కమాండర్ ముదస్సర్ చనిపోయినట్లు కసూరి అంగీకరించాడు. అతడి అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు అనుమతి లేదని, ఆ రోజు తాను చాలా ఏడ్చానని చెప్పాడు.
మరోవైపు, ముదస్సర్ అంత్యక్రియలకు పాక్ పంజాబ్ ప్రావిన్సు లోని సైనిక ఉన్నతాధికారులు, పోలీసులు, అధికారులు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి తను సూత్రధారిగా చెప్పి, ప్రపంచంలోనే ఫేమస్ చేశారని కసూరి అన్నాడు. మేము తదుపరి తరాన్ని జిహాద్ కోసం సిద్ధం చేస్తున్నామని, మేము చనిపోవడానికి భయపడమని బహిరంగంగా చెబుతున్నాడు.
