Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?

Bangladesh

Bangladesh

Bangladesh: 1857 తిరుగుబాటు తర్వాత ముస్లిం సమాజంలో మతపరమైన విద్యను ప్రోత్సహించడం, సామాజిక సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో 1866లో ఉత్తరప్రదేశ్‌లోని దేవబంద్‌లో దారుల్ ఉలూమ్ దేవబంద్ స్థాపించబడింది. మౌలానా ఖాసిమ్ నానోత్వీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ సంస్థ నుంచి దేవబంది భావజాలం భారత ఉపఖండంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. 1947లో భారత విభజన తర్వాత భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో ఈ మదర్సాల అభివృద్ధి వేర్వేరు మార్గాల్లో కొనసాగింది. ప్రస్తుతం దేవబంద్ నుంచి ప్రారంభమైన ఖౌమీ (దేవబంది) మదర్సాల నెట్‌వర్క్‌లో బంగ్లాదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సంస్థల సంఖ్య, విద్యార్థుల సంఖ్య, విస్తరణ పరంగా బంగ్లాదేశ్ భారత్, పాకిస్థాన్‌లను అధిగమించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవబంది మదర్సాల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 60 శాతం మంది బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు సమాచారం.

బంగ్లాదేశ్‌లోని ఖౌమీ విద్యా బోర్డు బెఫాకుల్ మదరిసిల్ అరబియా గణాంకాల ప్రకారం.. దేశంలో రిజిస్టర్ అయిన దేవబంది మదర్సాల సంఖ్య సుమారు 32,730గా ఉంది. వీటిలో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. ఇతర ఖౌమీ బోర్డుల పరిధిలో మరో 10 వేలకు పైగా మదర్సాలు ఉన్నట్లు సమాచారం. దీంతో బంగ్లాదేశ్‌లో మొత్తం ఖౌమీ మదర్సాల సంఖ్య 40 వేలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక భారత్‌లో జమియత్ ఉలేమా-ఏ-హింద్ ఆధ్వర్యంలోని మదర్సాల సంఖ్య సుమారు 20,900గా ఉండగా, విద్యార్థుల సంఖ్య 23 లక్షలకు పైగా ఉంది. పాకిస్థాన్‌లో సుమారు 27 వేల దేవబంది మదర్సాలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో దేవబంది మదర్సాల విస్తరణకు ప్రధాన కారణాల్లో తక్కువ ఖర్చుతో విద్య అందించడం ఒకటి. పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను మత విద్య కోసం ఈ సంస్థలకు పంపుతున్నాయి. అంతేకాకుండా ఆధునిక విద్యా వ్యవస్థలో మతపరమైన విద్యకు తగిన ప్రాధాన్యం లేదని భావించే కుటుంబాలు కూడా ఖౌమీ మదర్సాలను ఆశ్రయిస్తున్నాయి. 2018లో బంగ్లాదేశ్‌లో ఖౌమీ విద్యలో అత్యున్నత స్థాయి అయిన ‘దౌరా-ఏ-హదీస్’కు మాస్టర్ డిగ్రీతో సమాన గుర్తింపు లభించడం కూడా ఈ సంస్థల ప్రాముఖ్యత పెరగడానికి కారణమైందని చెబుతున్నారు. అయితే మదర్సాలపై ప్రభుత్వ నియంత్రణ, విద్యా ప్రమాణాలు, ఉపాధి అవకాశాలపై దేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఈ మదర్సాలు మత సంప్రదాయాలను కాపాడుతున్నాయని అభిప్రాయపడుతుండగా, మరికొందరు విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమని చెబుతున్నారు.

BRAC ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ డెవలప్‌మెంట్ అధ్యయనం ప్రకారం.. ఖౌమీ మదర్సాల్లో చదువు పూర్తి చేసిన వారిలో కేవలం 2.17 శాతం మంది మాత్రమే ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్నారని వెల్లడైంది. దాదాపు 46.55 శాతం మంది మసీదులు, మదర్సాలు, ఇతర మత సంస్థల్లో ఇమామ్‌లు, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. దీంతో మదర్సా విద్యార్థులకు ప్రధాన స్రవంతి విద్య, ఉపాధి అవకాశాలతో అనుసంధానం ఇప్పటికీ పెద్ద సవాలుగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.