Bal Thackeray’s grandson supports CM Ek Nath Shinde: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే మనవడు నిహార్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలిపాడు. త్వరలో జరిగే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ముంబై ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. నవంబర్ 3న జరుగుతున్న అంధేరీ ఉపఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ నుంచి రుతుజా లట్కేను ఉద్ధవ్ ఠాక్రే పోటీలో నిలబెడుతుండగా.. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం మద్దతుతో బీజేపీ ముర్జీ పటేల్ ను రంగంలోకి దింపింది.
శివసేనలో చీలిక వచ్చిన తర్వాత జరగబోతున్న మొదటి ఎన్నిక ఇదే కావడంతో ఇరు వర్గాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. బాల్ ఠాక్రే మొదటి కుమారుడు బింధు మాధవ్ ఠాక్రే కుమారుడే ఈ నిహార్ ఠాక్రే. వృత్తిరీత్యా న్యాయవాది. అసలు శివసేనపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఏక్ నాథ్ షిండేతో పోరాడుతున్న లీగల్ టీమ్ లో నిహార్ ఠాక్రే కూడా ఉన్నారు. ఏక్ నాథ్ షిండే తన తాత ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. అందుకే మద్దతు ఇచ్చానని నిహార్ ఠాక్రే చెప్పారు.
Read Also: Unstoppable with NBK: ‘భీమ్లానాయక్’ ఫస్ట్ ఛాయిస్ ఎవరు!?
దసరా వేడుకల్లో షిండేతో నిహార్ ఠాక్రే వేదికను పంచుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అన్నయ్య జైదేవ్ ఠాక్రే కూడా ఏక్ నాథ్ షిండేతో వేదికను పంచుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే మినహా మిగిలిన కుటుంబం అంతా ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే క్యాంపులోనే ఉన్నారు. బింధుమాధవ్ ఠాక్రే రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిహార్ ఠాక్రే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి హర్షవర్థన్ పాటిట్ కుమార్తె అంకితా పాటిల్ ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించలేదని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపబోనని బాలా సాహెబ్ స్పష్టంగా చెప్పారని.. కారణాలు ఏమైనా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2019లో ప్రజలు పాలించమని అధికారం ఇచ్చిన పార్టీలే ఇప్పుడు అధికారంలో ఉన్నాయని నిహార్ ఠాక్రే అన్నారు.
