సీనియర్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అజాంఖాన్ కలల ప్రాజెక్టుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ బుల్డోజర్ యాక్షన్ తీసుకోబోంది. ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్‌లో అజాంఖాన్‌కు చెంది జౌహర్ యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలపై సర్కార్ చర్యలకు రెడీ అయ్యింది. సరైన ప్లానింగ్ లేకుండా అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ యూనివర్సిటీలోని 40 భవనాలలో 38 భవనాలను కూల్చయాలని రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవనాలను తొలగించేందుకు యూనివర్సిటీకి స్వయంగా 15 రోజులు గడువు ఇచ్చింది. నిర్ణీత సమయంలోగా కూల్చివేత పని చేయని పక్షంలో అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
జౌహర్ యూనివర్సిటీ రాంపూర్ సదర్ తహసీల్‌లోని సింగన్‌ఖేడా గ్రామంలో ఉంది. ఈ ప్రాంతం 2024 నుంచి రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చింది. విచారణలో 40 భవనాల్లో కేవలం రెండు భవనాలకు మాత్రమే అధికారిక బిల్డింగ్ ప్లాన్స్‌కు ఆమోదం ఉన్నట్లు తేలింది. మిగిలిన 38 భవనాలు అనుమతి లేకుండా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. అయితే, యూనివర్సిటీ నిర్మాణ సమయంలో ఈ ప్రాంతం రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో లేదని, జిల్లా పంచాయతీ పరిధిలో ఉందని యూనివర్సిటీ వాదిస్తోంది. అయితే, రెండు భవనాలకు అనుమతి తీసుకున్నట్లే, మిగిలిన 38 భవనాలకు కూడా అనుమతి తీసుకోవాల్సి ఉండేదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

