Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు

Ayodhya

Ayodhya

Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర విరాళాల కేసులో ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.. అయోధ్య రామమందిర ట్రస్ట్‌కు సంబంధించిన భూ కొనుగోళ్లపై జరుగుతున్న దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఆలయానికి వచ్చిన కానుకల దుర్వినియోగ ఆరోపణలతో ప్రారంభమైన విచారణ ఇప్పుడు భూ లావాదేవీల వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రెండో దశ విచారణ కోసం అయోధ్యకు చేరుకుని దర్యాప్తును ముమ్మరం చేసింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు SIT పదవీకాలాన్ని పొడిగించగా, ట్రస్ట్‌కు సంబంధించిన నజూల్ భూమి లావాదేవీల్లో పాత్ర ఉన్నట్లు భావిస్తున్న మధ్యవర్తుల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. దర్యాప్తుకు పూర్తి సహకారం అందించాలని వారికి ఆదేశాలు జారీ చేయగా, సహకరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తులో భాగంగా ట్రస్ట్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన రిజిస్ట్రీ పత్రాలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పలువురు సాక్షులను పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. అలాగే అవసరమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని విచారణను కొనసాగిస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే సాక్ష్యాధారాలతో కూడిన ఫిర్యాదును SITకు సమర్పించారు. 2020–21లో భూ కొనుగోళ్లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటైన రాధేశ్యామ్ మిశ్రా కమిటీ నివేదిక ఇప్పటికీ బహిరంగం కాకపోవడంతో, తాజా దర్యాప్తుపై మరింత ఆసక్తి నెలకొంది. విచారణలో భాగంగా ట్రస్ట్‌తో సంబంధం ఉన్న కీలక వ్యక్తుల ఆస్తుల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయోధ్యతో పాటు లక్నో, నోయిడా, ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులపై సమాచారం సేకరిస్తున్నారు. దర్యాప్తులో అవకతవకలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే ట్రస్ట్‌కు చెందిన ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.