Atiq Ahmed Murder: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతీక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. జ్యూడీషియల్ కమిటీ ద్వారా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిటీతో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. 2017 నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై కమిటీ విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీ కూడా కోరారు. ఇదే కాకుండా గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై కూడా సీబీఐ చేత దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ కోరారు.
Read Also: Same-Gender Marriage: స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన కేంద్రం.. ఇది కోర్టుల పని కాదని సూచన..
ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, చట్ట పాలలనకు తీవ్రమైన ముప్పు అని, ఇది పోలీస్ రాజ్యం, అరాచకాలకు దారి తీస్తుందని, శిక్షించే అధికారం కేవలం న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుందని, పోలీసులు డేర్ డెవిల్స్ గా మారినప్పుడు న్యాయవ్యవస్థకు కుప్పకూలే ప్రమాదం ఉందని పిటషన్ లో పేర్కొన్నాడు. జీవించే హక్కు, స్వేచ్ఛను ఉల్లంఘించడం, ప్రజాప్రయోజనాలను ప్రభావితం చేస్తున్నందు వల్ల ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరాడు. పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో ఒక వ్యక్తిని హత్యచేయడం పోలీస్ వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నాడు పిటిషనర్.
ఇదిలా ఉంటే అతిక్ మరణంపై మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు అయింది. ఈ హత్యకేసును సీబీఐకి బదిలీ చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం రాత్రి అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ ను వైద్య పరీక్షల కోసం ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి వారిని కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. అతీక్ అహ్మద్ హత్యకు ముందు అతని కొడుకు అసద్ పోలీసుల ఎన్కౌంటర్ లో చనిపోయాడు. వీరంతా ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.