ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాంగంలో కాంస్యపతకం గెలుచుకున్న లవ్లీనాకు అస్సాం ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల నగదుతో పాటుగా, ఆమెకు పోలీసు శాఖల డీఎస్పీ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు, ఆమె నివశించే గ్రామంలో బాక్సింగ్ అకాడెమి ఏర్పాటుతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హామీ ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తరువాత లవ్లీనా ఈరోజు సొంత రాష్ట్రం అస్సాంకు చేరుకున్నది. ఆమెను రీసీవ్ చేసుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా ఆయన వరాల జల్లులు కురిపించారు. ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే వరకు ప్రతి నెలా లక్షరూపాయల చొప్పున స్కాలర్‌షిప్‌ను లవ్లీనాకు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.