NTV Telugu Site icon

Ashwini Vaishnaw: కాంగ్రెస్ హయాంతో ఎక్కువ రైలు ప్రమాదాలు.. గణాంకాలతో సహా ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw: ‘‘రీల్ మినిస్టర్’’ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మీ రికార్డులు చూసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు ఇతన ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో రైలు ప్రమాదాలు 68 శాతం తగ్గినట్లు చెప్పారు. గురువారం లోక్‌సభలో తన ప్రసంగంలో గణాంకాల ద్వారా ప్రతిపక్షాలను తూర్పారపట్టారు. కాంగ్రెస్ హయాంలో భద్రతా చర్యల్ని విస్మరించారని, ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ సమస్యని రాజకీయం చేయాలని కోరుకుంటున్నారని విమర్శించారు.

Read Also: Man Kills Wife: అక్రమ సంబంధం అనుమానం.. 19 ఏళ్ల భార్య సజీవ దహనం..

58 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో 1 కి.మీ కూడా అటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్(ఏటీపీ)ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు. జూలై 07న లోకో‌పైలట్ల వద్దకు వెళ్లిన రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ఆయన లోకోమోటివ్ డ్రైవర్లతో రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. మంత్రి ప్రసంగిస్తుండగా రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బేనివాల్..‘‘మీరు రీలు మంత్రి, పట్టాలు తప్పిన మంత్రి’’ అనడంతో ఒక్కసారిగా వైష్ణవ్ కోపంతో ‘‘నువ్వు నోరు మూసుకో’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం రీల్స్ చేసేవాళ్లం కాదని, కష్టపడి పనిచేసేవాళ్లమని చెప్పారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో వార్షిక సగటు ప్రమాదాల సంఖ్య 171 కాగా, ప్రధాని మోడీ హయాంలో 68 శాతం తగ్గిందని చెప్పారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రమాదాల సంఖ్యని 0.24 నుంచి 0.19కి తగ్గిస్తామని చెప్పినప్పుడు ఇదే ప్రతిపక్షాలు చప్పట్లు కొట్టారని, ఇప్పుడు ఇది 0.19 నుంచి 0.03కి తగ్గినప్పుడు ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో వారి ట్రోల్ ఆర్మీ సాయంతో తప్పుడు వాదనల్ని లేవనెత్తుతోందని, ప్రతీరోజూ రైళ్లలో ప్రయాణించే 2 కోట్ల మందిని భయపెట్టాలని చూస్తున్నారా..? అని అడిగారు.