Asaduddin Owaisi: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి గురించి ప్రధాని మోడీకి ముందే తెలుసా.?

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా యుద్ధంలోకి లాగబడ్డాయి. శనివారం ఉదయం యూఎస్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై దాడులు చేశాయి. సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఖతార్, సౌదీ, యూఏఈలతో పాటు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలపై క్షిపణుల్ని ప్రయోగించింది.

Read Also: Kakinada Firecracker Factory Blast: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. చంద్రబాబు, జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి..

ఇదిలా ఉంటే, ఈ యుద్ధంపై భారతదేశంలో రాజకీయం మొదలైంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేయబోతున్నట్లు ప్రధాని నరేంద్రమోడీకి ముందే తెలుసా..? అని ప్రశ్నించారు. దాడికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు ఇజ్రాయిల్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఆ దేశ పార్లమెంట్ అయిన నెస్సెట్‌లో ప్రధాని మోడీ ప్రసంగించారు.

ఈ యుద్ధం గురించి ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేస్తుందనే సమాచారం నెతన్యాహూ ముందుగా ప్రధానికి తెలియజేశారో లేదో దేశానికి చెప్పాలి. అలా చేసి ఉంటే ప్రధాని తన పర్యటనను ముగించి దేశానికి తిరిగి రావాలి. అమెరికా సహకారంతో ఇరాన్‌పై దాడి చేస్తున్న ఇజ్రాయిల్ మనకు తెలియజేయకుంటే ఇజ్రాయిల్ మనల్ని మోసం చేసినట్లే’’ అని ఓవైసీ అన్నారు. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ విమానం గాల్లో ఉండీ, ఇలాంటి దాడులు జరిగితే ఎవరు బాధ్యత వహించే వారు.? అని ప్రశ్నించారు. నెతన్యాహూ యుద్ధ వివరాలను ప్రధాని మోడీకి చెప్పారో లేదో దేశానికి తెలియజేయాలి. ఇరాన్‌పై దాడి చేయడానికి, గాజాలో పాలస్తీనియన్ల ఊచకోతకు ప్రధాని పర్యటనను ఉపయోగించుకున్నారని అన్నారు. దీని వల్ల భారత్ ఇరాన్‌తో కాకుండా ఇజ్రాయిల్ తో ఉందని సందేశం వస్తుందని, ఈ దాడి వల్ల భారత్‌కు ఏం లాభం ఉందని ప్రశ్నించారు.