NTV Telugu Site icon

Asaduddin Owaisi: నితీష్ కుమార్ “గోద్రా అల్లర్ల” సమయంలో బీజేపీలోనే ఉన్నారు.

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi comments on nitish kumar, mamata banerjee: ఇటీవల ఎన్డీఏ పార్టీకి, బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో మూడు రోజులు పర్యటించి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి వారిని కలిశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ప్రతిపక్షాలపై ఈ విమర్శలు చేశారు.

Read Also: Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ బీజేపీలో ఉంటూనే సీఎం అయ్యారని ఆయన విమర్శించారు. గోద్రా అల్లర్లు, హత్యాకాండ సమయంలో ఆయన బీజేపీతోనే ఉన్నారంటూ విమర్శించారు. 2015లో బీజేపీని వదలిపెట్టి ఆర్జేడీతో కలిసిన ఆయన.. మళ్లీ 2017లో బీజేపీతో చేరారని.. 2019లో నరేంద్ర మోదీని గెలిపించేందుకు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారని అన్నారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీని వదిలేశారని అన్నారు. గతంలో మమతా బెనర్జీ కూడా ఎన్డీయేలో సభ్యురాలే అని.. ఆర్ఎస్ఎస్ ను పలు సందర్భాల్లో పొగిడారని గుర్తు చేశారు ఓవైసీ.

మేము మైనారిటీ హక్కులు, అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు, వారికి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడేటప్పుడు వీరంతా మమ్మల్ని వివర్శిస్తుంటారని.. అర్థం లేని మాటలు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరంతా సెక్యులరిజం నిపుణులుగా మారి.. ఎవరు సెక్యులర్, ఎవరు మతతత్వ వాదో అని తేల్చే విధంగా వంచనకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వీరి నాటకాన్ని దేశం గమనిస్తోందని ఆయన అన్నారు.

Show comments