Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..

  • జయంత్ చౌదరిపై అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసీ స్పందన
  • జయంత్, ఆయన భార్య తనకు బాగా తెలుసని ఒవైసీ వ్యాఖ్య
  • యూపీలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేదన్న ఒవైసీ
  • బీజేపీని అడ్డుకోవాలనుకునే పార్టీలు తమతో మాట్లాడవచ్చని ఆఫర్
Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi:  సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) నేత కేంద్రమంత్రి జయంత్ చౌదరిని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ‘‘మేము పావు రూపాయిన ఒక రూపాయిగా మార్చాము, అయినా మీరు మమ్మల్ని వదిలేశారు’’ అని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ జయంత్ చౌదరికి మద్దతుగా నిలిచారు. ‘‘నాకు జయంత్ చౌదరి, ఆయన భార్య గురించి బాగా తెలుసు. అలాంటి ప్రకటన పూర్తిగా అబద్ధం. అలాంటి ప్రకటన చేయడం ద్వారా, మీరు మీ ఆలోచనా విధానాన్ని, మనస్తత్వాన్ని ప్రపంచానికి వెల్లడించారు’’ అని ఓవైసీ అఖిలేష్‌ను విమర్శించారు.

తాను జయంత్ చౌదరిని ఇప్పటికీ కలుస్తుంటానని, మీరు ఎందుకు బీజేపీలో చేరారు? అని అడిగానని, దానికి ఆయన నవ్వుతూ.. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అనే వారిని ఓవైసీ అన్నారు. మా మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, మేము వారిని గౌరవిస్తామని, అది మీ మనస్తత్వాన్ని భయపెడుతోందని అఖిలేష్‌పై ఓవైసీ మండిపడ్డారు.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల పొత్తులపై ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఉత్తర్ ప్రదేశ్‌లో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం తాము కోరుకోవడం లేదు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎవరికైనా ఇష్టం లేకపోతే, బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. వారు మాతో మాట్లాడవచ్చు. మీరు ఒక్కరే బీజేపీని ఆపలేరనే విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ’’ అని ఓవైసీ అన్నారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతిపై కూడా ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎలాంటి కుటుంబ వారసత్వం లేకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని నిర్మించుకుని, స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్దిమంది నాయకుల్లో మాయావతి ఒకరని అన్నారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, అదే స్థాయి రాజకీయం మళ్లీ సాధ్యమవుతుందా? అనేది వేరే విషయమని ఓవైసీ చెప్పారు.