ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల బంగ్లాలు నిండిపోయి ఉన్నాయని చెప్పారు. అందుబాటులోకి రాగానే కేజ్రీవాల్‌కు వసతి కల్పిస్తామని చెప్పారు. జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ అర్హులని వెల్లడించారు. ప్రస్తుతం ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో కేజ్రీవాల్ నివాసం ఉంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ జైలు కెళ్లారు. దాదాపు 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్నాక.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి సీటులో అతిషిని కూర్చోబెట్టారు. అనంతరం కేజ్రీవాల్ ఖాళీ చేసిన నివాసంలోకి అతిషి మకాం మార్చారు. వాస్తవానికి జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్‌కు ప్రభుత్వ బంగ్లాను కేటాయించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు కేటాయించలేదు. దీంతో కేజ్రీవాల్.. పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లోకి మారిపోయారు. తాజాగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. జాతీయ పార్టీ అధినేత కేజ్రీవాల్ అర్హులని.. త్వరలోనే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం తెలిపారు.
జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్‌కు బంగ్లా కేటాయించాలని కేంద్రానికి ఆప్ లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖకు లేఖ పంపింది. అయితే తాజాగా మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. ప్రస్తుతం తమ దగ్గర V మరియు VI రకం బంగ్లాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. VII రకం బంగ్లాలు అందుబాటులో లేవని తెలిపారు. VII రకం బంగ్లాలు అందుబాటులోకి రాగానే కేటాయిస్తామని ఖట్టర్ తెలిపారు.
ఇదిలా ఉంటే వచ్చే నెలలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఆప్ ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 11 మంది, రెండో విడతలో 20 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా కసరత్తు ప్రారంభించాయి. ఈసారి ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది. హస్తిన వాసులు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి.