దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. త్వరలో హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ ఆప్ ఎన్నికలకు రెడీ అయిపోయింది. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తోంది. ఇక ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు నెలకు రూ.2,100 సాయం, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం ప్రకటించారు. తాజాగా సోమవారం అర్చకులకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం ప్రకటించారు. అయితే సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అతిషి కేవలం తాత్కాలిక ముఖ్యమంత్రి అని.. ఎన్నికల్లో గెలిచాక తిరిగి ముఖ్యమంత్రి తానేనని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అతిషిని తాత్కాలిక సీఎం అని అనడం అవమానకరం అని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు. ఈ మేరకు అతిషికి రాసిన లేఖలో ఎల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్య రాజ్యాంగ విలువలకు, పదవి గౌరవానికి భంగం కలిగించేలా ఉందని లేఖలో విమర్శించారు. “ఈ వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా భావించాను. బాధపడ్డాను. ఇది మీకు మాత్రమే కాదు. భారత రాష్ట్రపతికి, ఆమె నియమించిన ఆమె ప్రతినిధిగా నాకు కూడా అవమానం. లెఫ్టినెంట్ గవర్నర్‌గా నేను ఆందోళన చెందుతున్నాను.”అని లేఖలో వీకే. సక్సేనా పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైలుకు వెళ్లారు. ఆరు నెలల తర్వాత సెప్టెంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి ఆ స్థానంలో అతిషిని కూర్చోబెట్టారు. తిరిగి ఎన్నికల్లో గెలిచేదాకా ఆ పదవిలో కూర్చోనని శపథం చేశారు. అయితే తాజాగా అతిషిని తాత్కాలిక సీఎం అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలను ఎల్జీ తప్పుపట్టారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రచారం చేపట్టింది. తిరిగి అధికారం ఛేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అలాగే బీజేపీ, కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగాయి. ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.