Arunachal CM: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్, భారతదేశానికి ఒక ‘‘వాటర్ బాంబ్’’ అని అరుణాచల్ సీఎం పెమా ఖండూ అన్నారు. ఇది అస్తిత్వ ముప్పు, సైనిక ముప్పు మాత్రమే కాకుండా, మరేదైనా పెద్ద సమస్యగా ఉంటుందని ఆయన అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మపుత్రపై(చైనా యార్లుంగ్ త్సాంగ్పోగా పిలుస్తుంది) చైనా నిర్మిస్తున్న అతిపెద్ద ఆనకట్ట, తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ మెగా డ్యామ్ టిబెట్ ప్రాంతంలో ఉంది. చైనా అంతర్జాతీయ జల ఒప్పందాలపై సంతకం చేయకపోవడం వల్ల, అది అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉండే అవకాశం లేదని ఆయన చెప్పారు.
చైనాను నమ్మలేమని, వారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదని ఖండూ అన్నారు. చైనా నుంచి సైనిక ముప్పుతో పోలిస్తే, ఇది అంతకన్నా పెద్ద ముప్పుగా తనకు అనిపిస్తోందని చెప్పారు. ఇది తెగలు, మన జీవనోపాధికి అస్తిత్వ సమస్య అని చెప్పారు. ఇది ఒక రకమైన ‘‘వాటర్ బాంబు’’ అని చెప్పారు. 2021లో చైనా ప్రధాని లీ కెకియాంగ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రకటించారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి నమీబియా పార్లమెంట్ “స్టాండింగ్ ఓవేషన్”.. వీడియో చూడండి..
నివేదికల ప్రకారం, 2024లో 137 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 60,000 MW విద్యుత్తును ఉత్పత్తి చేయాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మితమైతే ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టగా మారుతుంది.
వాస్తవానికి, అంతర్జాతీయ జల-పంపిణీ ఒప్పందాలకు చైనా సంతకం చేసి ఉంటే, ఈ ప్రాజెక్టు భారతదేశానికి ఒక వరంలా ఉండేదని పెమా ఖండూ అన్నారు. ఒకటి, బ్రహ్మపుత్ర ప్రవహించే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్‌ల వేసవి వరదలను ఇది నిరోధించి ఉండేది. కానీ, చైనా సంతకం చేయకపోవడం వల్ల అకాస్మత్తుగా నీటిని విడుదల చేస్తే సియాంగ్ బెల్ట్ నాశనం అవుతుందని చెప్పారు. దీని కారణంగా, భారత ప్రభుత్వం సియాంగ్ ఎగువ ఎగువ బహుళార్ధసాధక ప్రాజెక్టు రూపొందించిందని, ఇది మనకు రక్షణగా పనిచేస్తుందని సీఎం చెప్పారు.