NTV Telugu Site icon

Manipur: ఆర్మీపైకి కాల్పులు జరిపిన నిరసనకారులు.. ఉద్రిక్తంగా మణిపూర్..

Manipur

Manipur

Manipur: జాతుల ఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత రెండు నెలలుగా మైయిటీ, కూకీ తెగల మధ్య ఘర్షణ రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇరువర్గాలకు మద్దతుగా మిలిటెంట్లు కూడా రంగప్రవేశం చేసి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా పదివేలకు పైగా ఆర్మీ, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మణిపూర్ లో పహారా కాస్తున్నారు.

ఇదిలా ఉంటే మణిపూర్‌లోని హరోథెల్ గ్రామ సమీపంలోని ప్రాంతంలో గురువారం ఉదయం సాయుధ అల్లరిమూకలు కాల్పులు జరిపాయని సైన్యం తెలిపింది. భద్రతా బలగాలు కూడా కాల్పులకు స్పందించాయి. ‘‘కాలిబ్రేట్ పద్దతి’’లో స్పందించినట్లు ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. బలగాలు కాల్పులను ఆపేగలిగాయని.. అయితే దీంట్లో కొంత ప్రాణనష్టం కనిపిస్తోందని పేర్కొంది. ఆర్మీ ప్రకటన ప్రకారం, గురువారం ఉదయం 5:30 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రతిస్పందనగా సైన్యం ఆ ప్రాంతంలో పరిస్థితిని అదుపు తీసుకువచ్చేందుకు అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది.

Read Also: Dil Raju Son : దిల్ రాజు కొడుకు ఎలా ఉన్నాడో చూశారా?…. మొదటి సారిగా ఫొటో లీక్!

మరోవైపు గురువారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ సందర్శించేందుకు వెళ్లారు. పోలీసులు బిష్ణుపూర్ వద్ద రాహుల్ గాంధీ కాన్వాయ్ ను అడ్దుకోవడం రాజకీయంగా అగ్గిరాజేసింది. కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. అయితే పరిస్థితి బాగా లేనందున రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో చురచంద్రాపూర్ వెళ్లాల్సిందిగా సూచించారు. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే గ్రానెడ్ దాడి జరిగే అవకాశం ఉందని బిష్ణుపూర్ ఎస్పీ హైస్నామ్ బలరామ్ సింగ్ తెలిపారు.

మణిపూర్ రాష్ట్రంలో మెజారిటీ మెయిటీ వర్గానికి ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తూ.. కుకీ, నాగా ఇతర వర్గాలు మే 3న తీవ్ర నిరసన తెలిపాయి. ఆ సమయంలో హింస చెలరేగింది. ఇది రెండు వర్గాల మధ్య హింసకు దారి తీసింది. మణిపూర్ జనాభాలో మైయిటీలు 53 శాతం ఉన్నారు. వీరు కేవలం 10 శాతం ఉన్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో నివసిస్తున్నారు. 40 శాతం ఉన్న కుకీ, నాగా వంటి గిరిజనులు మిగతా 90 శాతం ప్రాంతంలో ఉన్నారు. అయితే మైయిటీలు ఎస్టీలు కాకపోవడంతో కొండ ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేకపోయింది. తమ జనాభా విస్తరణ కోసం గత కొంతకాలంగా వారు ఎస్టీ హోదాను కోరుతున్నారు. మిగతా తెగలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకు మణిపూర్ ఘర్షణల్లో 100కు పైగా మంది చనిపోయారు.