NTV Telugu Site icon

CM Siddaramaiah: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర.. ముడా స్కామ్‌పై కర్ణాటక సీఎం..

Cm Siddaramaiah

Cm Siddaramaiah

CM Siddaramaiah: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కాములో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్కామ్‌లపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారియి. మైసూర్ నగరం అభివృద్ధి కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన భూమి ఉండటం, వారికే ఎక్కువ లబ్ధి జరిగేలా చూడటం వంటి ఆరోపణలు ఈ స్కాముతో ముడిపడి ఉన్నాయి. ముడా భూ కుంభకోణం కేసులో ప్రదీప్ కుమార్, టిజె అబ్రహం మరియు స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు పిటిషన్ దాఖలు చేయడంతో, గవర్నర్ గెహ్లాట్ విచారణకు ఆమోదం తెలిపారు.

ఈ కేసులో గవర్నర్, సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఓకే చెప్పడం సంచలనంగా మారింది. అయితే, తాను ఏ తప్పు చేయలేదని కర్ణాటక ముఖ్యమంత్రి అన్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమని చెప్పారు. దీనిని కోర్టులో సవాల్ చేస్తానని అన్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం బినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంతా నా వెంటే ఉన్నారని సీఎం చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: Rajasthan: విద్యార్థుల మధ్య గొడవ, కత్తి పోట్లు.. ఉదయ్‌పూర్‌లో మతహింస..

ముడా స్కీమ్ ద్వారా 50:50 పథకాన్ని తీసుకువచ్చారు. ఎవరైతే తమ భూములను ప్రభుత్వానికి అందిస్తే, దానిని డెవలప్‌చేసి అందులో సగం భూమిని భూమి ఇచ్చిన వారికి ఇవ్వాలన్నదే పథకం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎకరం భూమని ప్రభుత్వానికి ఇస్తే అందులో 50 శాతం అంటే అర ఎకరం భూమని భూమిని కోల్పోయిన వారికి ఇవ్వాలి. వారు దానిని మార్కెట్ రేటు ప్రకారం అమ్ముకోవచ్చు. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి చెందిన మైసూరు పరిసరాల్లో 3 ఎకరాల 16 గంటల భూమిని నగర అభివృద్ధి కోసం అప్పగించింది. సేకరించిన భూమిలో ఏర్పాటు చేసిన లేఅవుట్ల లోనే ఆమెకు సైట్లు కేటాయించాలి, కానీ దీనికి బదులుగా నగరంలోని అత్యంత విలువైన 14 ప్రత్యామ్నాయ స్థలాల కేటాయించడం వివాదాస్పదమైంది. ఇది చట్టవిరుద్ధమని, దీని వల్ల ఖజానాకు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని లోకాయుక్త పోలీసులకు జూలైలో దాఖలు చేసిన ఫిర్యాదులో అబ్రహం ఆరోపించారు. ఈ ఫిర్యాదులో సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్ర, ముడా సీనియర్ అధికారుల పేర్లు ఉన్నాయి.

తన భార్య పరిహారం పొందిన భూమిని ఆమె సోదరుడు మల్లికార్జున 1998లో కానుకగా ఇచ్చారని సిద్ధరామయ్య వాదించారు. అయితే మల్లికార్జున 2004లో అక్రమంగా సేకరించారని, ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కార్యకర్త కృష్ణ ఆరోపించారు. భూమిని 1998లో కొనుగోలు చేసినట్లు చూపించారని ఆరోపించారని ఆరోపించారు. 2014లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్వతి ఈ భూమికి పరిహారం ఇవ్వాలని కోరారు.

ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. ఈ రోజు సాయంత్రం బెంగళూర్‌లో కేబినెట్ అత్యవసర సమావేశం జరగబోతోంది. రాజ్ భవన్‌ని రాజకీయాలకు కేంద్రంగా మార్చారంటూ కాంగ్రెస్ దుయ్యబడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గే అత్యవసరంగా బెంగళూర్ బయలుదేరారు. మరోవైపు ఈ సీఎంపై కుట్ర అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.