Rajasthan: రాజస్థాన్ ఉదయ్‌పూర్ నగరం అట్టుడుకుతోంది. మతహింసతో ఆ నగరంలో హింసాత్మక వాతావరణం ఏర్పడింది. ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ ఆ తర్వాత మత విద్వేషాలకు కారణమైంది. నగరంలో మత ఘర్షణల కారణంగా శుక్రవారం ఉదయ్‌పూర్‌లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ గుంపు రాళ్లు రువ్వి మూడు నాలుగు కార్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని బాపూ బజార్, హతిపోల్, ఘంటా ఘర్, చేతక్ సర్కిల్ మరియు సమీప ప్రాంతాలలో మార్కెట్లు మూసివేయబడ్డాయి. షాపింగ్ మాల్‌లపై కూడా రాళ్ల దాడి జరిగింది.
Read Also: Lucknow: లక్నో ఎయిర్‌పోర్టులో రేడియోధార్మిక పదార్థం లీక్.. ఖాళీ చేయించిన అధికారులు
ఉదయ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలతో 10 తరగతి విద్యార్థి అతని సహవిద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ ఘటనలో దాడి చేసిన బాలుడు ముస్లిం వర్గానికి చెందడం, గాయపడిన విద్యార్థి హిందూ వర్గానికి చెందడంతో నగరంలో మత హింసను ప్రేరేపించింది. ఈ ఘటనపై ఉదయ్‌పూర్ కలెక్టర్ అరవింద్ పోస్వాల్ మాట్లాడుతూ.. ఇద్దరి పిల్లల మధ్య జరిగిన గొడవ గురించి మాకు సమాచారం అందిందని, గాయపడిన విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు.
ఈ సంఘటన తర్వాత కొన్ని హిందూ సంస్థల సభ్యులు నిరసనగా నగరంలోని మధుబన్ వద్ద గుమిగూడారు, ఇది ఆ తర్వాత హింసాత్మక పరిణామాలకు దారి తీసింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది మోహరించబడింది. డివిజనల్ కమిషనర్ రాజేంద్ర భట్, కలెక్టర్ అరవింద్ పోస్వాల్, ఎస్పీ యోగేష్ గోయల్, రాజ్యసభ ఎంపీ చున్నీలాల్ గరాసియా, లోక్‌సభ ఎంపీ మన్నాలాల్ రావత్, ఎమ్మెల్యేలు తారాచంద్ జైన్, ఫూల్ సింగ్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితిపై సమావేశం నిర్వహించారు.