NTV Telugu Site icon

Annamalai: మోడీ కేబినెట్‌లోకి అన్నామలై..?

Annamalai

Annamalai

Annamalai: ప్రధానిగా వరసగా మూడోసారి నరేంద్రమోడీ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. మొత్తం 543 లోక్‌సభ ఎంపీ స్థానాల్లో ఎన్డీయేకి 293 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 240 ఎంపీలను గెలిచి, దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. గతంలో స్వతహాగా మెజారిటీ మార్క్ 272ని దాటి బీజేపీ స్థానాలను కైవసం చేసుకోగా, ఈ సారి మాత్రం దాదాపుగా 30 సీట్లకు దూరంలో ఆగిపోయింది. టీడీపీ, జేడీయూ, శివసేన వంటి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పటికే దాదాపుగా మోడీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది.

READ ALSO: Modi swearing: రేపే మోడీ ప్రమాణస్వీకారం.. విపక్షాలకు అందని ఆహ్వానాలు

అయితే, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఈసారి మోడీ కేబినెట్‌లో ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.తమిళనాడులో బీజేపీకి ఒక్కసీటు రాలేదు, అన్నామలై కూడా కోయంబత్తూర్ నుంచి ఓడిపోయారు. కానీ బీజేపీ ఓట్ల శాతం మాత్రం భారీగా పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 3.66 శాతం ఓట్లు వస్తే, 2024లో ఏకంగా ఇది 11.24 శాతానికి పెరిగింది. బీజేపీ మిత్రపక్షాలతో కూడితే ఈ శాతం 18 వరకు ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 10.67 శాతంగా ఉన్నాయి. అధికార డీఎంకేకి 26.93 శాతం, ప్రతిపక్ష ఏఐడీఎంకేకి 20.46 శాతం ఓట్లు రాగా, మూడో స్థానంలో బీజేపీ ఉంది. చెన్నై సెంట్రల్, చెన్నై సౌత్, కోయంబత్తూర్, కన్యాకుమారి, మధురై, నీలగిరి, తిరునల్వేలి, తిరువళ్లూరు, వెల్లూరు, ధర్మపురి, రామనాథపురం, తేని వంటి నియోజవర్గాలతో పాటు మరో 9 నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఎన్డీయే సమావేశానికి అన్నామలైకి కూడా ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ తన ప్రసంగంలో తమిళనాడులో ఓట్ల శాతం పెరగడాన్ని కూడా ప్రస్తావించడం గమనార్హం. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం తమిళ మీడియాలో మాత్రం అన్నామలైకి ఖచ్చితంగా కేంద్రమంత్రి పదవి దక్కుతుందని అంచనా వేస్తోంది.