Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..

  • బీజేపీకి అన్నామలై రాజీనామా..
  • తమిళనాడు రాజకీయాల్లో ప్రభావం..
  • భవిష్యత్తు విజయ్-ఉదయనిధి-అన్నామలైదే..
Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీకి అన్నామలై గుడ్‌బై చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఒక రకంగా చెప్పాలంటే, అన్నామలై రాజీనామా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. తమిళనాడులో సింగిల్ డిజిట్‌కు పరిమితమైన పార్టీ ఓట్ షేర్‌ను 11 శాతానికి తీసుకువచ్చిన ఘటన అన్నామలైదే.

అయితే, అన్నామలై కొత్త రాజకీయ వేదిక తమిళనాడు రాజకీయాలను రీసెట్ చేయబోతోంది. ఇన్నాళ్లు ద్రవిడవాదం ఆధారంగా నడిచిన రాజకీయాలుకు పోటీ ఇచ్చేలా అన్నామలై రూపంలో జాతీయవాద రాజకీయాలు ఉండే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తమిళ రాజకీయాలు ఇప్పుడు కొత్త తరానికి ప్రవేశిస్తున్నాయి. సాంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు విజయ్, అన్నామలై రూపంలో కొత్త సవాళ్లు ఎదురవ్వడం ఖాయం.

×
×
Ad

విజయ్-ఉదయనిధి-అన్నామలై శకం ప్రారంభం:

తమిళ రాజకీయాలను గత 50 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకేలు శాసిస్తూ వచ్చాయి. అయితే విజయ్ రూపంలో వీటికి అడ్డుకట్టపడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే బంపర్ విక్టరీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాన్ని డీఎంకే, అన్నాడీఎంకేలు అసలు ఊహించలేదు.

ప్రస్తుతం ఉన్న స్టాలిన్, పళనిస్వామి శకం ముగుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్టాలిన్ వారసుడిగా ఉదయనిధి స్టాలిన్ డీఎంకేను నడిపించవచ్చు. అయితే, అన్నాడీఎంకే పళనిస్వామి నేతృత్వంలో ఎన్ని రోజులు మనుగడ సాగిస్తుందో చెప్పలేని విధంగా ఉంది. బలమైన మాస్ లీడర్ లేకపోవడంతో అన్నాడీఎంకే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవచ్చు. ఈ నేపథ్యంలోనే అన్నామలై కొత్త పార్టీతో రాక తమిళ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది.

రాబోయే కాలం విజయ్, ఉదయనిధి స్టాలిన్, అన్నామలైలదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా తమ ప్రభావాన్ని కోల్పోవడం ఖాయం. ఈ రెండు పార్టీలు తోక పార్టీలుగా మిగులుతాయి. ఈ ముగ్గురు యువనేతలు రాబోయే కాలంలో తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారు.