NTV Telugu Site icon

Punjab: అమృత్‌సర్ ఆలయంపై బాంబు దాడి.. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం..

Temple Blast

Temple Blast

Punjab: శుక్రవారం అర్థరాత్రి పంజాబ్ అమృత్‌సర్‌లోని ఓ దేవాలయంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కిటికీ అద్ధాలు, గోడలు దెబ్బతిన్నాయి. ఖాండ్‌వాలా ప్రాంతంలోని ఠాకూర్ ద్వార ఆలయం వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌ప వచ్చి, ఆలయంపై పేలుడు పదార్థాలు విసిరి పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.

ఆలయ పూజారి తెల్లవారుజామున 2 గంటలకు దాడి గురించి పోలీసులకు సమాచారం అందించారని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ ధృవీకరించారు. సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ టీమ్స్ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. ఈ ఘటనకు పాకిస్తాన గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)తో సంబంధం ఉందని కమిషనర్ భల్లార్ అన్నారు. పంజాబ్‌లో అల్లర్లు సృష్టించడానికి పాక్ ఐఎస్ఐ మన యువతను ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఘటనకు కారణమైన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

Read Also: CM Chandrababu: 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశా.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ దాడి పంజాబ్‌లో రాజకీయ దుమారానికి కారణమైంది. రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. శిరోమణి అకాలీదళ్ ఈ దాడిని తీవ్రమైన, సున్నితమైన సంఘటనగా అభివర్ణించింది. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని చెప్పింది. బీజేపీ నేత రణవీత్ సింగ్ బిట్టూ మాట్లాడుతూ.. ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, శాంతిభద్రతల పర్యవేక్షణలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

ఈ ఘటనపై సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ‘‘పంజాబ్‌లో శాంతిని దెబ్బతీసేందుకు ఎల్లప్పుడూ అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, గ్యాంగ్‌స్టర్లు,దోపిడీ దానిలో భాగమే, పంజాబ్ ఒక కల్లోలిత రాష్ట్రంగా మారిందని చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హోలీ పండుగ సమయంలో, ఇతర రాష్ట్రాల్లో, ఊరేగింపుల సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. కానీ పంజాబ్‌లో అలాంటివి జరగవు. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి బాగుంది’’ అని అన్నారు.