Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడైన అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ విస్తృతంగా వెతుకుతున్నాయి. పంజాబ్ సరిహద్దులను మూసేసి అతడిని పట్టుకునేందుకు రెండు రోజులు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 78 మంది మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.
Read Also: Asaduddin Owaisi: బీహార్‌లో కేసీఆర్‌పై ఓవైసీ ప్రశంసలు.. విజన్ ఉన్న నాయకుడంటూ కితాబు
ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ గురించి విస్తూపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఏకంగా పంజాబ్ యువతను ‘మానవబాంబులు’గా మార్చేందుకు డ్రగ్స్ డి-అడిక్షన్ సెంటర్లను ఉపయోగించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గురుద్వారాల్లో ఆయుధాలను నిల్వ చేయాలనే ప్లాన్ లో ఇతడు ఉన్నాడని తెలిసింది. దీంతోనే ఇలాంటి ఖలిస్తానీ సంఘవిద్రోహ శక్తులను పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో అతడిని అరెస్ట్ చేసేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించింది.
విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, ఖలిస్తానీ సానుభూతిపరుల ఆదేశం మేరకు గతేడాది దుబాయ్ నుంచి అమృత్ పాల్ సింగ్ ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఖలిస్తానీవేర్పాటువాదాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి లేని పాకిస్తాన్, భారత దేశంలో అశాంతి చెలరేగేలా అమృత్ పాల్ సింగ్ ను వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. డి-అడిక్షన్ సెంటర్లలో చేరిన యువకులను ‘గన్ కల్చర్’ వైపు మళ్లించేవాడని, మానవబాంబులా పనిచేసి గతంలో పంజామ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ ను ఉగ్రవాది దిలావర్ సింగ్ హతమార్చిన పంథాను ఎంచుకోవడానికి యువకులకు బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.