దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ పోల్స్‌కి అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్.. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదిలా ఉంటే శీతాకాలంలో విమర్శలు.. ప్రతివిమర్శలతో హస్తిన వాతావరణం వేడెక్కుతోంది. శుక్రవారం ప్రధాని మోడీ… కేజ్రీవాల్ టార్గెట్‌గా ధ్వజమెత్తగా.. తాజాగా అమిత్ షా కూడా ఆప్ అధినేత లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక నివాసంపై దుబారా ఖర్చు చేశారంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఒక బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. ‘‘కొందరు పిల్లలు తనను కలవడానికి తన ఇంటికి వచ్చారని.. వాళ్లను అడిగాను.. కేజ్రీవాల్ ఢిల్లీ కోసం ఏం చేశారని అడిగాను. శీష్‌మహల్ నిర్మించుకున్నారని ఓ పిల్లవాడు చెప్పాడు.’’ అని అమిత్ షా గుర్తుచేశారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ఏం చేయలేదు గానీ.. అద్దాల మేడలాంటి రాజభవనం నిర్మించుకున్నారని ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక.. ప్రభుత్వ కారు.. బంగ్లా తీసుకోనని చెప్పిన ఆయన.. ఈరోజు ఢిల్లీ ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ లెక్క చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
శుక్రవారం ప్రధాని మోడీ కూడా ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. దశాబ్ద కాలంగా దేశ రాజధానిని పట్టిపీడిస్తున్న విపత్తు అని ఆప్‌ను అభివర్ణించారు. తాను విలాసవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదని.. ప్రజల కోసం తాము ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసం కోసం విపరీతంగా ఖర్చు చేశారన్న ఆరోపణలపై బీజేపీ విమర్శలు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యుడీ) విడుదల చేసిన ఇన్వెంటరీలో బంగ్లాలో విలాసవంతమైన ఉపకరణాలు, పునర్నిర్మాణాలు ఉన్నాయని తెలిపింది. అయితే ప్రధాని మోడీ ఆరోపణలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. 10 ఏళ్లలో బీజేపీ ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. 2022 నాటికి శాశ్వత గృహాలు అని వాగ్దానం చేసి.. ఐదేళ్లలో 4,700 ఇళ్లు నిర్మించారని పేర్కొన్నారు. ఆప్ పాలనలో 22,000 తరగతి గదులు, మూడు కొత్త విశ్వవిద్యాలయాలతో పాటు లెక్కలేనన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. 29 మందితో కూడిన ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పర్వేష్ వర్మను కేజ్రీవాల్‌కు పోటీకి దించింది. ఇక రమేష్ బిధూరిని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై బరిలోకి దింపింది. అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.