Amit Shah: పార్లమెంట్‌లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై వాడీవేడీ చర్చ జరిగింది. అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య తీవ్రమైన చర్చ నడిచింది. ఓట్ చోరీ, ఈవీఎంలపై రాహుల్ గాంధీ ఆరోపించగా, అందుకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(EVM)లను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని షా గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు రాహుల్ గాంధీ వీటిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈవీఎంల ద్వారా 2004లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలించిందని ఆయన గుర్తు చేశారు. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పుడు ఈవీఎంలను వాడారని, మేము 2014లో గెలిచినప్పుడు మాత్రం అనుమానిస్తున్నారని అమిత్ షా అన్నారు.
దీనికి ముందు, అమిత్ షా ఓట్ చోరీ గురించి సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యానికి ముందు ప్రధాని అభ్యర్థిగా సర్దార్ పటేల్‌కు ఎక్కువ ఓట్లు వస్తే, జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అయ్యారని, రెండోసారి ఇందిరా గాంధీ రాయ్‌బరేలీ నుంచి గెలిచినప్పుడు ఓట్ చోరీ జరిగిందని, ఆమెకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిందని అన్నారు. మూడోసారి, సోనియా గాంధీ పౌరసత్వం పొందకముందే ఓటు వేశారని, దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తోందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ తాము గెలిస్తే, ఈసీ సరిగా పనిచేసినట్లు, ఓడిపోతే అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తుందని విమర్శించారు.