Amit Shah-Sergio Gor: అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ

  • అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ
  • ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
  • మోడీ-ట్రంప్ భేటీ మరుసటి రోజే కలవడంపై సర్వత్రా ఆసక్తి
Amitshah1

Amitshah1

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ, సరిహద్దు భద్రత, నేరస్తులపై సంయుక్త చర్యలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశం ఫ్రాన్స్‌లోని జీ 7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన మరుసటి రోజే జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

×
×
Ad

భేటీ అనంతరం సెర్జియో గోర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘హోంమంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మాదకద్రవ్యాలు, అక్రమ డ్రగ్స్ నుంచి ప్రజలను రక్షించడం, సరిహద్దుల భద్రతను బలోపేతం చేయడం, రెండు దేశాల్లో నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడంలో సహకారాన్ని మరింత పెంచే అంశాలపై ఫలవంతమైన చర్చ జరిగింది” అని పేర్కొన్నారు.

జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో సమావేశమైన మోడీ.. భారత్-అమెరికా మధ్య వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలపై కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అభినందించినట్లు మోడీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హార్ముజ్ జలసంధి తెరిచి ఉండటం అత్యంత కీలకమని, సముద్రయాన సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు.

ఇదిలా ఉండగా గత నెల భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక ఖనిజాలు, సరఫరా గొలుసులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి అనేక అంతర్జాతీయ అంశాల్లో భారత్, అమెరికా వ్యూహాత్మకంగా ఒకే దిశలో ఉన్నాయని పేర్కొన్నారు. “ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాముల్లో భారత్ ఒకటి. ఉగ్రవాదం కారణంగా ఇరు దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయాయి. అందువల్ల ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్-అమెరికా మధ్య బలమైన సమన్వయం ఉంది” అని మార్కో రూబియో స్పష్టం చేశారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్జాతీయ నేరాల నియంత్రణ వంటి అంశాల్లో భారత్-అమెరికా సహకారం మరింత బలోపేతం కానున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.