కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కళంకిత నేతలు జైలు నుంచి పరిపాలించడమేంటి? అని ప్రశ్నించారు. అందుకోసమే కళంకిత నేతలను తొలగించే బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ బిల్లు ద్వారా ముఖ్యమంత్రి అయినా.. ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే రాజీనామా చేయాల్సిందేనని.. 30 రోజుల్లో బెయిల్ రాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kerala: లైంగిక వేధింపుల ఎఫెక్ట్.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్
విపక్ష నేతలు జైలుకెళ్లి సులభంగా ప్రభుత్వాలను నడపగలమని అనుకుంటున్నారని.. జైలునే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారన్నారు. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, ఉన్నతాధికారులు జైలు నుంచే కీలక ఆదేశాలు తీసుకోవల్సి ఉంటుందన్నారు. ఇది మంచి పద్దతేనా? అని అడిగారు. ఈ విధానాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. జైలు నుంచి ప్రభుత్వాలు నడిపే పరిస్థితి మన దేశంలో ఉండకూడదన్నారు.
జగదీప్ ధన్‌ఖర్ అనారోగ్య కారణాల చేత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారని.. ఈ అంశాన్ని ఎక్కువగా సాగదీయొద్దని హితవు పలికారు. కొత్తగా ఏదైనా కనుగొనడానికి ప్రయత్నించొద్దని తెలిపారు. కేవలం అనారోగ్యంతో రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Marko Producer : మార్కో నిర్మాత సెకండ్ మూవీ.. ఇంకా అరాచకం
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. నక్సల్ వ్యతిరేక నిఘా ఉద్యమం సల్వా జుడుంను రద్దు చేస్తూ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారని.. 2011 సుప్రీంకోర్టు తీర్పును అమిత్ షా గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ తీర్పు వచ్చిందని వివరించారు. ఈ నిర్ణయం వామపక్ష తీవ్రవాదానికి కొత్త ఊతం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నక్సలిజానికి మద్దతిచ్చే సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపించారు.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ నుంచి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుదర్శన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.
