NTV Telugu Site icon

Jammu Kashmir: టార్గెటెడ్ కిల్లింగ్స్ పై అమిత్ షా హైలెవల్ మీటింగ్

Amit Shah

Amit Shah

జమ్మూ కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్ కలకలం రేపుతున్నాయి. వరసగా కొన్ని రోజులుగా ఉగ్రవాదులు అమాయకమైన హిందువులను, ముస్లింలను చంపుతున్నారు. గురువారం కాశ్మీర్ కుల్గాంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు వలస కార్మికులను చంపేశారు. దీంతో లోయ నుంచి కాశ్మీరి పండిట్లు పెద్ద సంఖ్యలో వలస వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో టార్గెట్ కిల్లింగ్స్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఈ మీటింగ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హాతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ సీసీ అజయ్ కుమార్ భల్లా, సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ పంకజ్ సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ హాజరయ్యారు. కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్, హిందువుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఉగ్రవాదుల ఏరివేతను గురించి చర్చించారు.

కాశ్మీర్ లో గత వారం రోజులుగా టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ తో మొదలైన టెర్రరిస్టుల టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ తరువాత హిందూ మహిళా ఉపాధ్యాయురాలితో పాటు రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరగిన కొన్ని గంటల్లోనే తాజాగా బీహార్ కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను టెర్రరిస్టులు చంపారు. దీంతో లోయలోని కాశ్మీరీ పండిట్లు భయాందోళలకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఆందోళన చేస్తున్నారు.