NTV Telugu Site icon

Amit Shah: గాంధీనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా..

Amit Shah

Amit Shah

Amit Shah: సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ గాంధీనగర్ ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అమిత్ షా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా హాజరయ్యారు. బీజేపీ కంచుకోటగా ఉన్న గాంధీనగర్ నుంచి గతంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ప్రాతినిధ్యం వహించారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో గాంధీనగర్, లక్నో నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పోటీ చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన లక్నో సీటును నిలబెట్టుకున్నారు.

Read Also: Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..

మరోవైపు గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ కార్యదర్శి సోనాల్ పటేల్ బరిలో ఉన్నారు. 2019లో అమిత్ షా గాంధీనగర్ నుంచి బంపర్ విక్టరీ సాధించారు. ఏకంగా 69.67 శాతం ఓట్లను సాధించి, ఈ స్థానంలో బీజేపీ పవర్ ఏంటో నిరూపించారు. ఈ సారి కూడా భారీ విజయంపై అమిత్ షా కన్నేశారు.2024 లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో జరుగుతున్నాయి. జూన్ 4న మొత్తం 543 ఎంపీ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. గాంధీనగర్‌కి మూడో దశలో అంటే మే 7న ఎన్నికలు జరగనున్నాయి.

బూత్ స్థాయి నుంచి హోం మంత్రి వరకు..

గుజరాత్ లోని మన్సాలోని ఓ గ్రామంలో జన్మించిన అమిత్ షా, ప్రస్తుతం దేశంలోనే ప్రధాని మోడీ తర్వాత నెంబర్-2 నాయకుడిగా ఉన్నారు. పార్టీకి తిరుగులేని విజయాలను కట్టబెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి స్పూర్తి పొందిన షా తన 16 ఏట ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్లడం ప్రారంభించారు. 1983లో ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీలో చేరారు. ఏబీవీపీలో చేరడానికి ముందు నరన్‌పురా ప్రాంతంలో బూత్ స్థాయి కార్యకర్తగా పనిచేశారు. గోడలపై బీజేపీ పోస్టర్లు అంటించారు. 1984-85లో బీజేపీలో చేరారు. అతని కాలంలోని అతడి పనితీరును పార్టీ గ్రహించి బీజేపీ యువమోర్చా జాతీయ కోశాధికారిని చేసింది.

1991లో అమిత్ షా రాజకీయ కెరీర్ మలుపు తిరిగింది. ఆ ఏడాది గాంధీనగర్ ఎంపీ స్థానంలో ఎల్‌కే అద్వానీ ప్రచార నిర్వహకుడిగా షా నియమితులయ్యారు. ఈ స్థానాన్ని అద్వాని సునాయాసంగా గెలుచుకున్నారు. అద్వానీ దగ్గర అమిత్ షాకి మంచి పేరు వచ్చింది. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన సమయంలో అమిత్ షా అత్యంత నమ్మకస్తుడిగా మారారు. 2014లో కేంద్ర హోంమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు.