NTV Telugu Site icon

Bangladesh: ఇండియాతో సంబంధాలపై బంగ్లా ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

Waker Uz Zaman

Waker Uz Zaman

Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, భారత్-బంగ్లాల మధ్య సంబంధాలు మునుపటిలా లేవు. ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్ భావజాలం, హిందువులపై దాడులు, భారత్ వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. దీనికి తోడు బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటోంది. ఈ పరిణామాలు భారత్‌కి ఆందోళనకరంగా మారాయి.

ఇదిలా ఉంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ మౌనం వీడారు. ఆయన డైలీ ప్రోథోమ్ ఆలోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని ‘‘ముఖ్యమైన పొరుగుదేశం’’ అని చెప్పారు. ఇండియాపై బంగ్లాదేశ్ అనేక విధాలుగా ఆధారపడి ఉందని వెల్లడించారు. రెండు దేశాల మధ్య ‘‘గివ్ అండ్ టేక్ రిలేషన్స్’’ ఉన్నాయని, ఇది న్యాయం, సమానత్వంపై ఆధారపడి ఉందని, ఈ సూత్రాల ఆధారంగా ఢాకా, న్యూఢిల్లీతో మంచి సంబంధాలను కొనసాగిస్తుందని చెప్పారు.

Read Also: Tragedy: భార్యతో గొడవ, బావిలో దూకిన భర్త.. రక్షించే క్రమంలో మరో నలుగురు మృతి..

“భారతదేశం ఒక ముఖ్యమైన పొరుగు దేశం. మనం అనేక విధాలుగా భారత్‌పై ఆధారపడి ఉన్నాం. మరియు భారతదేశం కూడా మన నుండి సౌకర్యాలను పొందుతోంది. వారి ప్రజలు పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్‌లో అధికారికంగా మరియు అనధికారికంగా పనిచేస్తున్నారు. ఇక్కడ నుండి చాలా మంది వైద్య చికిత్స కోసం భారతదేశానికి వెళతారు. మేము వారి నుండి చాలా వస్తువులను కొనుగోలు చేస్తాము. కాబట్టి బంగ్లాదేశ్ స్థిరత్వంపై భారత్‌కు చాలా ఆసక్తి ఉంది. ఇదీ ఇచ్చిపుచ్చుకునే సంబంధం’’ అని ఆర్మీ చీఫ్ చెప్పారు. రెండు దేశాల సంబంధాలు న్యాయబద్ధతపై ఆధారపడి ఉండాలని, బంగ్లాదేశ్ పౌరులు భారత్ తమపై ఆధిపత్యం చెలాయిస్తుందని భావించకూడదని అన్నారు.

ఈశాన్య భారతదేశం భద్రతను నిర్ధారించడానికి బంగ్లాదేశ్ నుంచి భారత్ సహకారం గురించి ప్రశ్నించగా.. బంగ్లాదేశ్ భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయదని, అదే సమయంలో న్యూఢిల్లీ నుండి అదే విధంగా ఆశిస్తానని హామీ ఇచ్చారు, రెండు దేశాలు తమ ప్రయోజనాలను సమానంగా అనుసరించాలని అన్నారు.

షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోవడాన్ని ఆర్మీ చీఫ్ ‘‘ చారిత్రకమైనది’’గా పిలిచారు. బంగ్లాదేశీయులు ఇప్పుడు స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం బంగ్లాదేశ్ ఆర్మీ సహకరిస్తుందని చెప్పారు.

Show comments