NTV Telugu Site icon

Amarinder Singh: బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్.. పార్టీ కూడా విలీనం

Amarinder Singh

Amarinder Singh

Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరెన్ రిజిజు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. అమరీందర్ సింగ్ తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను కూడా బీజేపీలో విలీనం చేశారు. అంతకుముందు అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే ఊహాగాహాలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ కొన్ని రోజుల కిందట ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా ఆయనను అభ్యర్థిగా ఎన్నుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ అనూహ్యంగా బెంగాల్‌ గవర్నర్‌గా పనిచేసిన జగదీప్ ధన్‌కర్‌ను ఎంచుకుంది.

ఆయన పార్టీలో చేరేముందు ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన అమరీందర్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. అమరీందర్ సింగ్ పార్టీలో చేరడం పట్ల న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్తం చేస్తూ దేశంలోని సరైన ఆలోచనాపరులు ఐక్యంగా ఉండాలని అన్నారు.”పంజాబ్ వంటి సున్నితమైన రాష్ట్రాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఎప్పుడూ దేశ భద్రతకు ముందు రాజకీయాలను ఉంచలేదు” అని రిజిజు అన్నారు.

Assembly Seats: ఈసీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ సర్కారులకు సుప్రీంకోర్టు నోటీసులు

సెప్టెంబర్ 12న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత అమరీందర్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన అమరీందర్‌.. గతేడాది హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. అప్పటి పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌తో విభేదాలు రావడంతో ఆయనను సీఎం పదవి నుంచి కాంగ్రెస్‌ తప్పించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ పార్టీని ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి చాలా లాభమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.