Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఈ రోజు సీల్దా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని దోషిగా తేల్చింది. హత్య, అత్యాచారం సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. సోమవారం ఈ శిక్షలను విధించనుంది. గతేడాది ఆగస్టులో మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న సమయంలోనే వైద్యురాలిపై పాశవికంగా హత్యాచారం జరిగింది. ఈ కేసులో ఆస్పత్రిలో పోలీస్ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారు. కేసుని విచారించిన సీబీఐ ఇతడికి వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలను కోర్టు ముందుంచింది. డీఎన్ఏ రిపోర్ట్, వెంట్రుకలు, నిందితుడి బ్లూటూత్ ఇలా పలు ఆధారాలు సంజయ్ రాయ్‌కి వ్యతిరేకంగా లభించాయి. అయితే, తీర్పు చెబుతున్న సమయంలో ‘‘ తాను ఈ నేరం చేయలేదని, తనను ఇరికిస్తున్నారు’’ అని సంజయ్ రాయ్ చెప్పాడు.
Read Also: Thaman : మీ మాటలు జీవితాంతం గుర్తు ఉంటాయి.. చిరు ట్వీట్‌కు తమన్ రిప్లై
ఇదిలా ఉంటే, ఈ కేసులో బాధితురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు తాము కోర్టు తలుపులు తడుతూనే ఉంటామని చెప్పారు. ‘‘ఇక్కరు మాత్రమే కాదు, డీఎన్ఏ నివేదికలో నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నట్లు చూపిస్తోంది. కేవలం సంజయ్ రాయ్‌ని మాత్రమే నిందితుడిగా చేర్చారు. నిందితులు అందరికి శిక్ష పడినప్పుడు మాత్రమే మాకు ఉపశమనం కలుగుతుంది. మాకు న్యాయం జరిగే వారకు కోర్టు తలుపులు తడుతూనే ఉంటాము. దేశ ప్రజలు మద్దతు మాకు ఉంది’’ అని వైద్యురాలి తండ్రి అన్నారు. తమ కూతురి గొంతుపై గాయాలు ఉన్నా, వాటి శాంపిళ్లను సేకరించలేదని ఆరోపించారు.
ఈ కేసులో సీబీఐపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో సీబీఐ ఏమీ చేయలేదని అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు మేము అనేక ప్రశ్నలు లేవనెత్తామని, కోర్టు నుంచి ఆధారాలు కోరామని, అయితే సీబీఐ తమకు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదని చెప్పారు. రెండు నెలలు కోర్టు అన్ని ఆధారాలను సమీక్షించిందని, ఏ శిక్ష వేయాలనేది కోర్టు నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. తాము ప్రధాని, హోం మంత్రి, న్యాయ మంత్రికి లేఖలు రాసినప్పటికీ, తమకు ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఈ రోజు కోర్టుకు తమని పిలువలేని, తమ లాయర్‌ని రావద్దని కోరినట్లు తెలిపారు.