NTV Telugu Site icon

Akhilesh Yadav: రాహుల్‌కి అఖిలేష్ కండీషన్.. దేనికి సంకేతం..!

Condition

Condition

రాహుల్ గాంధీ (Rahul Gandhis Yatra) చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈనెల 16న వారణాసిలో యాత్ర ప్రవేశించింది. ఈనెల 21 వరకు రాహుల్ యాత్ర యూపీలో కొనసాగుతుంది. ఈరోజు అమేథీ నియోజకవర్గంలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది.

ఇదిలా ఉంటే సమాజ్‌‌వాదీ పార్టీ.. ఇండియా కూటమిలో మిత్రపక్షం. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సమావేశాల్లో అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ యాత్ర యూపీలో కొనసాగుతున్నా.. అఖిలేష్ మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. దీంతో కూటమిలో ఏదో జరుగుతుందన్న లుకలుకలు వినపడుతున్నాయి. ఇప్పటికే జేడీయూ అధ్యక్షుడు నితీష్‌కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయారు. అఖిలేష్‌పై కూడా అలాంటి అనుమానాలే రేకెత్తుతున్నాయి. ఈ అంశంపై తాజాగా అఖిలేష్ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో సమాజ్‌వాదీ పార్టీ చర్చలు జరుగుతున్నాయని.. సీట్ల పంపకాలు పూర్తయ్యాక భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని తేల్చిచెప్పారు. సీట్ల పంచాయితీ తేలాకే రాహుల్‌ను కలుస్తానని అఖిలేష్ కుండబద్దలు కొట్టినట్టు (Condition) చెప్పారు. మరో రెండు రోజుల్లో రాహుల్ యాత్ర యూపీలో ముగుస్తోంది. ఈనెల 22 నుంచి రాష్ట్రంలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో యాత్రను కుదించి ఈనెల 21కి ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండ్రోజుల్లోనైనా అఖిలేష్ పాల్గొంటారా? లేదంటే డుమ్మా కొడతారా? అన్నది వేచి చూడాలి.

మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఇండియా కూటమి ఇప్పుడు ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఎవరికీ వారే చర్చలు లేకుండా సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పటికే ఒంటరి పోరుకే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు తలెత్తాయి.

ఇంకోవైపు బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా భవిష్యత్ కార్యాచరణపై రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించింది. బీజేపీకి 370 సీట్లు.. ఎన్డీఏ కూటమికైతే 400 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. ఇంత కాన్ఫిడెన్స్‌గా కమలనాథులు ఉంటే.. ఇండియా కూటమి మాత్రం సీట్ల పంచాయితీతోనే తర్జన భర్జన పడుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.