మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అయోధ్యలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతేకాకుండా జనవరి 7 మరియు జనవరి 8న ఉత్తరప్రదేశ్‌లోని గోండా మరియు బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు అఖిలేష్.. కాగా, యూపీలో ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.. కానీ, కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి.
Read Also: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఇక, గత నెలలో అఖిలేష్ యాదవ్ పశ్చిమ యూపీలో నిర్వహించాల్సిన ర్యాలీని కూడా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. ఆయన భార్య మరియు కుమార్తె కరోనా బారినపడ్డారు.. ఆ తర్వాత మూడు రోజుల పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించి.. కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.. ఇదే సందర్భంలో తనకు కోవిడ్ నెగటివ్‌గా వచ్చిన రిపోర్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు.. కోవిడ్ కేసులు పెరగడం, థర్డ్ వేవ్ దృష్ట్యా యూపీలో పెద్ద ర్యాలీలను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. కోవిడ్, ఒమిక్రాన్ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసింది. యూపీతో పాటు త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ మాస్ ర్యాలీలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.. తమ రాష్ట్రాల్లోని కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేయాలని, ఆపై ర్యాలీలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. గౌతంబుద్ధ్ నగర్ జిల్లాలో జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు..