Site icon NTV Telugu

Sunetra Pawar: రూ. 25,000 కోట్ల బ్యాంకు కుంభకోణంలో అజిత్ పవార్ భార్యకు క్లీన్ చిట్..

Ajit Pawar, Sunetra Pawar

Ajit Pawar, Sunetra Pawar

Sunetra Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌కి రూ. 25,000 కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రస్తుతం సునేత్ర పవార్ బారామతి స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (MSCB) కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) జనవరిలో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులో ఎలాంటి క్రిమినల్ నేరం జరగలేదని పేర్కొంది.

ఈ కుంభకోణంలో అజిత్ పవార్ ఆయన భార్య సునేత్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై పోలీసుల నిర్ణయంపై ప్రతిపక్ష శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) స్పందించింది, ఈ నిర్ణయాన్ని ఖండించింది. ‘‘ప్రధాని మోడీ గతంలో పవార్ల కుటుంబం అవినీతి కుటుంబం అని ఆరోపించారు. కానీ, ఈ రోజు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆర్థిక నేరాల విభాగం ఎలాంటి నేరం లేదని ముగింపు నివేదికలో పేర్కొంది’’ అని శివసేన(ఉద్ధవ్) నేత ఆనంద్ దూబే అన్నారు.

Read Also: Asaduddin Owaisi: అల్లర్లు చెలరేగితే మీదే బాధ్యత.. ముస్లింలపై ప్రధాని వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..

గతేడాది ఎన్సీపీలో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపు ఉండటంతో నిజమైన ఎన్సీపీ అతడిదే అని ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో శరద్ పవార్‌కి షాక్ తగిలింది. ప్రస్తుతం బీజేపీ-శివసేన(షిండే) ప్రభుత్వంలో అజిత్ పవార్ కూటమి భాగంగా ఉంది. మరోవైపు శరద్ పవార్ కాంగ్రెస్ పక్షంతో ఇండియా కూటమిలో భాగంగా ఉన్నారు. ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతిలో శరద్ పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే‌పై సునేత్ర పోటీ చేస్తోంది. దీంతో ఈ స్థానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే బీజేపీ ‘వాషింగ్ మెషన్’ విమర్శలను ప్రతిపక్షాలు మరోసారి లేవనెత్తాయి. బీజేపీ తన వ్యతిరేకులపై ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగిస్తోందని, వారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత విచారణ నెమ్మదించడం లేదా క్లీన్ చిట్ ఇస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ వాషింగ్ మెషన్ అంటూ పిలుస్తున్నారు.

Exit mobile version