మాంసం అమ్మకాల నిషేధంపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతోంది. ఆగస్టు 15న గోకులాష్టమి సందర్భంగా.. ఆగస్టు 20న జైన పండుగ పర్యుషణ్ పర్వ సందర్భంగా కబేళాలు, మాంసం దుకాణాలు మూసేయాలని ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్, మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆగస్టు 15న మాంసం అమ్మకాలు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేశాయి.
ఇది కూడా చదవండి: Bengaluru: స్నేహితుడి భార్యతో ఎఫైర్.. చివరికిలా…!
అయితే ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తప్పుపట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదన్నారు. ఆషాఢ ఏకాదశి, మహాశివరాత్రి, మహావీర్ జయంతి వంటి మతపరమైన పండుగల సమయంలో నిషేధం విధిస్తుంటారు. అలాంటి సమయంలో ఆంక్షలు అంగీకరిస్తామని.. కానీ మహారాష్ట్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయాల్లో కూడా అలాంటి ఆదేశాలను అమలు చేయడం బాగోలేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోడీ.. ఎప్పుడంటే..!
ఈ నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే కూడా తప్పుపట్టారు. ప్రజలు తినే ఆహారంపై నిషేధం విధించే హక్కు కమిషనర్‌కు లేదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏమి తినాలో.. ఏమి తినకూడదో మీరు నిర్ణయిస్తారా? అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా అదే రోజు తాము మాంసాహారం తింటామని చెప్పారు. ఆహారంపై దృష్టి పెట్టే కమిషనర్.. రోడ్ల గుంతలపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.
ఎన్‌సీపీ (ఎస్పీ) నాయకుడు జితేంద్ర అవ్హాద్ కూడా తప్పుపట్టారు. మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం ఇదేమీ పద్ధతి అని నిలదీశారు. ఆగస్టు 15న మాంసాహారం తింటామని ప్రకటించారు.
