Site icon NTV Telugu

Ajit Pawar Plane Crash: ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు.. పైలట్‌ ఏం చేశాడంటే..!

Ajit Pawar Plae Crash2

Ajit Pawar Plae Crash2

అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు బృందాలు శోధిస్తున్నాయి. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం ప్రమాదం జరగగానే ఢిల్లీ నుంచి హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని (ఏఏఐబీ) కీలక ఆధారాలను సేకరించింది.

అయితే తాజాగా ఈ విమాన ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా వర్గాలు పేర్కొంటున్నాయి. పైలట్ తప్పిదం కారణంగానే ఈ ఘోరం జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.

పైలట్ రన్‌వేను తప్పుగా అంచనా వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. మొదటి ల్యాండింగ్‌కు కుదరనప్పుడు.. రెండో ల్యాండింగ్‌కు సిద్ధపడుతున్న తరుణంలో పైలట్ పొరపాటు చేసినట్లుగా ప్రాథమిక పరిశోధనలో వెల్లడైనట్లుగా వర్గాలు చెబుతున్నాయి. ల్యాండింగ్‌ సమయంలో విజిబిలిటీ సరిగా లేదని.. ఆ సమయంలో వెంటనే పూణెకు మళ్లించి ఉండవచ్చని నివేదించింది. కానీ పైలట్ మాత్రం ఆ పని చేయలేనట్లుగా కనిపించింది. అయినా కూడా పైలట్ విమానాన్ని తిరిగి సమలేఖనం చేయడానికి ప్రయత్నించాడని.. ఓ వైపు వేగం.. ఇంకో వైపు ల్యాండింగ్‌కు ఆలస్యమైనట్లుగా కనిపించినట్లుగా వర్గాలు చెబుతున్నాయి. అయితే వీఐపీ విమానాలు, హెలికాప్టర్ కార్యకలాపాల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. సమయానికి ల్యాండ్ చేయడానికి ఒత్తిడి ఉన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులు సూచిస్తున్నాయి.

బుధవారం ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి విమానం బయల్దేరింది. బారామతి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సిద్ధపడుతున్న తరుణంలో కూలిపోయింది. ఈ విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, కో పైలట్ పింకీ మాలి, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, పైలట్ సెకండ్ ఇన్ కమాండ్ శాంభవి పాఠక్ ఉన్నారు. మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం దర్యా్ప్తు చేస్తోంది. ఇక గురువారం బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రి నారా లోకేష్, పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు.

Exit mobile version