Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..

Ajit Doval

Ajit Doval

Ajit Doval: భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోవల్ తన సర్వీసు స్టార్టింగ్ రోజుల్లో ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన సంఘటనను తాజాగా బహిర్గతం చేశారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో మాట్లాడిన ఆయన, సిక్కిం సరిహద్దుల్లో జరిగిన ఒక మిషన్ విఫలమై తమ సీక్రెట్ ఏజెంట్లు చైనా సైన్యం చేతికి చిక్కిన వైనాన్ని, ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులను ఆయన విద్యార్థులతో పంచుకున్నారు.

అసలేం జరిగిందంటే..

సిక్కిం భారత్‌లో పూర్తిస్థాయిలో విలీనం కాకముందు, 20 ఏళ్ల వయసున్న యువ ఐపీఎస్ అధికారిగా అజిత్ డోవల్ అక్కడి సీక్రెట్ సర్వీస్ టీంకి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న టైం అది.. సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కదలికలపై నిఘా పెట్టడం ఆయన బాధ్యతల్లో ఒకటి. ఈ క్రమంలో సమాచార సేకరణ కోసం పంపించిన ఒక ప్రత్యేక నిఘా బృందం వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, 15 రోజులైనా వెళ్లిన వాళ్లు రాలేదు. ప్రతికూల వాతావరణం, మంచు తుఫానుల నడుమ వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలియక అజిత్ డోవల్ అండ్ టీంకి తీవ్ర ఆందోళన నెలకొంది.

చైనా చెరలో భారత ఏజెంట్లు
ఆ తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి తనకు ఫోన్ రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు డోవల్‌ వివరించారు. మా టీం వాళ్లు సరిహద్దు దాటి చైనా సైన్యానికి దొరికిపోయినట్లు తేలింది. సుదీర్ఘ విచారణ, తీవ్ర ఒత్తిళ్ల అనంతరం దౌత్యపరమైన సంప్రదింపులతో చైనా వారిని రిలీజ్ చేసింది. అయితే వారు అప్పటికే మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన స్థితిలో తిరిగి ఇండియా వచ్చారు. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ స్టార్ట్ కావడంతో, తన కెరీర్ అంతటితో క్లోజ్ అయ్యిందని భావించినట్లు డోవల్ చెప్పారు. అయితే అధికారిక విచారణలో హెడ్ ఆఫీస్ నుంచి తమకు అందిన మ్యాపులు, రూట్ స్కెచ్‌లలో తీవ్ర లోపాలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. తప్పుడు మ్యాపుల కారణంగానే తమ ఏజెంట్లు దారి తప్పి చైనా భూభాగంలోకి ప్రవేశించారని స్పష్టమవడంతో తనకు క్లీన్ చిట్ లభించిందన్నారు.

షెర్పా నేర్పిన జీవిత పాఠం
ఆ క్లిష్ట సమయంలో తీవ్ర నైరాశ్యంలో ఉన్న తనకు, ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ఓ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ చెప్పిన మాటలు కొత్త దిశానిర్దేశం చేశాయన్నారు. “జీవితం కూడా ఒక మ్యాప్ లాంటిదే.. కొందరు సరిగ్గా చదువుతారు, కొందరు తప్పుగా చదువుతారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం? ఎక్కడికి వెళ్లాలి? అక్కడికి ఎలా చేరుకోవాలి? అనే ఈ మూడు విషయాలపై స్పష్టత ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చు” అని ఆ షెర్పా చెప్పిన పాఠాన్ని ఈ సందర్భంగా డోవల్ విద్యార్థులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.