Air India: ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా.. ప్రయాణికులపై మరింత భారం..

  • పెరిగిన ఎయిర్ ఇండియా ఛార్జీలు..
  • విమానరంగంపై పడిన ఇరాన్ వార్ ఎఫెక్ట్..
Indigo Air India

Indigo Air India

Air India: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభానికి కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై కూడా పడింది. తాజాగా ఎయిర్ ఇండియా తన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన సర్ ఛార్జీలను పెంచింది. దీని భారం ప్రయాణికులపై పడుతోంది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 10 నుంచి అమెరికా, యూరప్ వంటి అంతర్జాతీయ రూట్లలో పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.

Read Also: Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

దూరాన్ని బట్టి ఎయిర్ ఇండియా సర్‌ఛార్జీలను వసూలు చేయనుంది. 500 కి.మీ వరకు రూ. 299, 2000 కి.మీ పైన దూరాలకు రూ. 899 అదనంగా వసూలు చేయనున్నారు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా మార్గాల్లో 280 డాలర్లు (సుమారుగా రూ. 23000కు పైగా), యూరప్ దేశాలకు 205 డాలర్లు ( సుమారు రూ. 17,000) , సౌత్ ఈస్ట్ ఆసియాకు 100 డాలర్లు, పశ్చిమాసియాకు 50 డాలర్లను వసూలు చేయనుంది.

ఇంధన ధరల పెరుగుదల ఛార్జీలకు ప్రధాన కారణంగా ఉంది. బ్యారెల్ జెట్ ఇంధన ధర 99.40 డాలర్లు ఉండగా, మార్చి నాటికి ఇది 195.19 డాలర్లకు చేరింది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను దెబ్బతీసింది. సర్‌ఛార్జీలు పెంచినప్పటికీ, పెరిగిన ధరలు పూర్తిగా ఇంధన ఖర్చుల్ని భర్తీ చేయవని, ముఖ్యంగా అంతర్జాతీయ మార్గాల్లో అని ఎయిర్ ఇండియా చెప్పింది.