Air India Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 274 మంది మరణించారు. ఇందులో విమానంలో ఉన్న 241 మందితో పాటు విమానం కూలిన ప్రదేశంలో ఉన్నవారు కూడా మరణించారు. విమానం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో, హాస్టల్‌లోని మెడికోలు మరణించారు.
READ ALSO: King Charles: కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం.. ఎయిరిండియా మృతులకు నిమిషం మౌనం పాటించనున్న చార్లెస్
ఈ ప్రమాదంలో, టీ స్టాల్ సమీపంలో నిద్రిస్తున్న 14 ఏళ్ల ఆకాష్ పట్ని కూడా మరణించాడు. టీ స్టాల్ నడుపుతున్న తన తల్లికి టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు వెళ్లిన 8వ తరగతి చదువుతున్న ఆకాష్ ఈ ప్రమాదంలో బలయ్యాడు. విమానం కూలిపోయిన సమయంలో విమానం రెక్క ఆకాష్‌కి సమీపంలో పడింది. దీంతో, అతడికి మంటలు అంటుకున్నాయి. కుమారుడిని రక్షించేందుకు తల్లి సీతాబెన్ ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. కుమారుడిని రక్షించే ప్రయత్నంలో ఆమెకు కాలిన గాయాలయ్యాయి.
“విమానం కూలిపోయిన హాస్టల్ భవనం పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గర ఆకాష్ ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో అతని తల్లి సీతాబెన్ టీ తయారు చేస్తోంది. మొదట, ఒక పెద్ద లోహపు ముక్క ఆకాష్ తలపై పడింది, తరువాత అతను మంటల్లో చిక్కుకున్నాడు” అని అతని అత్త చందాబెన్ వివరించింది. ఆకాష్ శరీరం గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లు చెప్పారు.
