Air India Crash: ఎయిరిండియా ప్రమాదం ఎవియేషన్ ఇండస్ట్రీలోనే అత్యంత దారుణమైన సంఘటనల్లో చేరింది. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కి వెళ్తున్న విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మినహా 242 మందిలో అందరూ చనిపోయారు. మెడికల్ హాస్టల్ భనవంపై కూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. మొత్తంగా 265 మంది చనిపోయారు.
అయితే, ఇప్పుడు ప్రమాదంపై ఇన్సూరెన్స్‌పై చర్చ జరుగుతోంది. భారతదేశ బీమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావచ్చని పలువురు చెబుతున్నారు. ఈ ప్రమాదం వల్ల కలిగిన నష్టం 211 మిలియన్ డాలర్ల నుంచి 280 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అంటే రూ. 2400 కోట్లు.
Read Also: Honeymoon Murder: రాజా లాగే మరో మహిళను హత్య చేయాలని ప్లాన్.. సోనమ్ కేసులో సంచలన విషయం..
ప్రభుత్వ రంగ రీఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రామస్వామి నారాయణన్ ప్రకారం, విమాన సంస్థ ఫ్లీట్ ఇన్సూరెన్స్ పాలసీ సాధారణంగా విమాన భాగాలు, విడిభాగాలు, ప్రయాణికులకు, థర్డ్ పార్టీకి జరిగిన నష్టాలను కవర్ చేస్తుంది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మరణించారు. ఈ ప్రమాదంలో విమానానికి, జరిగిన నష్టాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. ఈ క్లెయిమ్ ఏజ్, కాన్ఫిగరేషన్, ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రయాణీకులకు పరిహారం 1999 మాంట్రియల్ కన్వెన్షన్ కిందకు వస్తుంది, దీనికి భారతదేశం 2009లో సంతకం చేసింది. ఈ పరిహారం స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRలు) కింద లెక్కించబడుతుంది, ప్రస్తుత విలువ 1,28,821 SDRలు లేదా దాదాపు $1,71,000, అంటే రూ.1.47 కోట్లు. దీనికి తోడు, ప్రమాదం వల్ల మూడో పక్షానికి నష్టం బాధ్యత, క్రాష్ సైట్‌లో ప్రాణనష్టాన్ని కూడా లెక్కిస్తారు. ఇప్పటికే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతీ కుటుంబానికి టాటా గ్రూప్ రూ.1 కోటి పరిహారాన్ని ప్రకటించింది.