Air Force’s Massive Exercise Near LAC In Northeast: ఇండియా-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ నిన్న చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో మాట్లాడారు. లడఖ్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనికులతో యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దీంతో చైనా మరేదైనా కుట్ర చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
Read Also: Abdul Rehman Makki: కాశ్మీర్ పాకిస్తాన్ జాతీయ సమస్య.. గ్లోబల్ ఉగ్రవాది మక్కీ..
ఈ నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. చైనాతో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య భారత్ భారీగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇటీవల తరలించిన డ్రోన్ స్క్వాడ్రన్‌లతో సహా ఈశాన్య ప్రాంతంలోని అన్ని ప్రధాన వైమానిక స్థావరాలను కలుపుకుని భారత వైమానిక దళం ‘ప్రళయ్’ విన్యాసాలు చేయనున్నట్లు సమాచారం. భారత వాయుసేన రవాణా, ఇతర విమానాలతో పాటు రఫెల్, సుఖోయ్ ఎస్యూ-30 ఫైటర్ జెట్లతో వైమానిక దళం సైనిక విన్యాసాలు చేసింది. రాబోయే రోజుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను రంగంలోకి దింపి వైమానికి విన్యాసాలు చేసే అవకాశం ఉంది. హసిమారా, తేజ్ పూర్, చబువా వంటి ఎయిర్ బేసులు కేంద్రంగా వైమానిక విన్యాసాలు చేస్తున్నారు.
సిక్కిం, సిలిగురి కారిడార్ సెక్టార్‌లో శతృవు కార్యకలాపాలను పర్యవేక్షించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వైమానిక దళం ఇటీవల ఇతర స్థావరాల నుండి ఈశాన్య ప్రాంతాలకు డ్రోన్‌ల స్క్వాడ్రన్‌ను తరలించింది. ఇటీవల కాలంలో తూర్పు సెక్టార్ లో చేపట్టిన రెండో అతిపెద్ద సైనిక విన్యాసాలు ఇవే. గతేడాది డిసెంబర్ నెలలో ఇలాగే సైనిక విన్యాసాలు చేశారు. డోక్లామ్ వద్ద చైనా తన కార్యకలాపాలు పెంచుతోందనే ఇంటెలిజెన్స్ నిఘా మేరకు భారత్ కూడా యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకుంటోంది.