Air Chief Marshal Vivek Ram Chaudhari: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శనివారం 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. చండీగఢ్ లో దీనికి సంబంధించిన వేడుకలు జరిగాయి. గంట పాటు 80 విమానాలతో సుఖ్నా సరస్సుపై వైమానికి విన్యాసాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎఎఫ్ ను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు. చారిత్రాత్మక ‘వెపన్ సిస్టమ్ బ్రాంచ్’ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్త కార్యాచరణ శాఖను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని ఆయన అన్నారు. అన్ని రకాల క్షిపణుల ప్రయోగానికి, విమానాల్లో వెపన్ సిస్టమ్ నిర్వహణ కోసం ‘ వెపన్ సిస్టమ్ బ్రాంచ్’ తోడ్పతుందని అన్నారు. దీని వల్ల రూ.3400 కోట్లు ఆదా అవుతాయని అన్నారు.
Read Also: Black Dog Telugu Movie: ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ సినిమా టీజర్ కి విశేషాదరణ
వచ్చే ఏడాది మహిళా అగ్నివీర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్సులో చేర్చుకుంటామని ప్రకటించారు. అగ్నిపథ్ పథకం ద్వారా భారత వైమానికి దళంలోకి వైమానిక యోధులను చేర్చడం సవాలుతో కూడుకున్నదని.. ఇది భారతదేశ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం అని వీఆర్ చౌదరి అన్నారు. ప్రతీ అగ్నివీర్ కూడా ఎయిర్ ఫోర్సులో చేరడానికి ముందు వారికి సరైన నైపుణ్యాలు ఉండే విధంగా శిక్షణాపద్దతిని మార్చామని ఆయన అన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ లో.. ప్రాథమిక శిక్షణ కోసం 3000 మందిని తీసుకోనున్నట్లు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని ఆయన అన్నారు.
ఈ ఏడాది ఐఏఎఫ్ ఆత్మనిర్భర భారత్, స్వదేశీకరణపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ఆయన వీఆర్ చౌదరి అన్నారు. కొత్తగా తీసుకువచ్చిన ప్రచండ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ గత వారమే ఐఏఎఫ్ లోకి చేర్చుకున్నామని అన్నారు. తేజస్, ఆరుద్ర, అశ్లేషా రాడార్, ఆస్ట్రా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, ఆకాష్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థ, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్‌లను ఐఏఎఫ్ లో చేర్చడం ద్వారా స్వదేశీకరణలలో ముందున్నామని అన్నారు. 1932లో యునైటెడ్ కింగ్‌డమ్ రాయల్ ఎయిర్ ఫోర్స్ సహాయక దళంగా భారతీయ వైమానిక దళం ఏర్పడింది.