Bihar Elections: బీహర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్డీయే, ఇండియా కూటముల్లో సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 100 సీట్లలో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎంఐఎం శనివారం తెలిపింది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. బీహార్‌లో తాము థర్డ్ ఫ్రండ్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
ఎంఐఎం బీహార్ ప్రెసిడెంట్ అఖ్తరుల్ ఇమాన్ మాట్లాడుతూ.. తాము 100 సీట్లలో పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నామని, ఇకపై ఎన్డీయే, మహ ఘటబంధన్(ఆర్జేడీ+ కాంగ్రెస్+ లెఫ్ట్ కూటమి) రెండూ మా ఉనికిని గ్రహించాల్సి వస్తుందని అన్నారు. తాను ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లకు పొత్తుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ రాసిని వారి నుంచి స్పందన రాలేదని అన్నారు. ప్రస్తుతం, ఎంఐఎం తన ఉనికిని చాటుకోవడానికి చేయగలిగిందంతా చేస్తామని బీహార్ ఎంఐఎం చీఫ్ అన్నారు.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీల్లో జరుగుతాయి మరియు ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. రాజకీయ పరిశీలకుల ప్రకారం, బీహార్ ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. మొత్తం జనాభాలో ముస్లింలు 17 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా, ఎంఐఎం ముస్లిం ప్రాబల్యం ఉన్న సీమాంచల్ ప్రాంతంలోని కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా వంటి జిల్లాల్లో ప్రభావం చూపనుంది.
