Delhi: 2020 ఢిల్లీ అల్లర్లలో పోలీసులకు తుపాకీ గురిపెట్టి ప్రాచుర్యం పొందిన నిందితుడు షారుక్ పఠాన్ కుటుంబాన్ని ఢిల్లీ ఎంఐఎం పార్టీ చీఫ్ డాక్టర్ సోయబ్ జమై కలిశారు. ఇప్పుడు ఈ కలయిక వివాదాస్పదంగా మారింది. అల్లర్ల సమయంలో పోలీసులకు తుపాకీని గురిపెట్టిని ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జమై, షారుక్ పఠాన్ ఇంటికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పఠాన్ తీహార్ జైలులో ఉన్నాడు. ఢిల్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఇతడిని తన అభ్యర్థిగా దింపొచ్చనే చర్చ నడుస్తోంది.
అయితే, ఈ పుకార్లపై షోయబ్ జమై మాట్లాడుతూ.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా జరుగొచ్చని అన్నారు. మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గమైన సీలంపూర్‌కు మంచి అభ్యర్థి అవసరం ఉందని చెప్పారు. పఠాన్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎంఐఎం నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Read Also: Venu Swamy : అల్లు అర్జున్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..
ఎంఐఎం నేత నిందితుడి ఇంటికి వెళ్లి కలవడంపై రాజకీయ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ శాంతి, సామరస్యానికి భంగం కలిగించేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందని బీజేపీ నేత విజేందర్ గుప్తా అన్నారు. అశాంతి సృష్టించడం, నగరాన్ని విభజించడం వారి ఏకైక ఉద్దేశ్యమని చెప్పారు. పఠాన్ కుటుంబాన్ని సందర్శించిన తర్వాత… విచారణ లేకుండా జైలులో మగ్గుతున్న వారికి సంఘీభావం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘ఇటీవల నేను జైలులో ఉన్న షారుక్ పఠాన్ తల్లిని అతని ఇంట్లో కలిశాను. ఢిల్లీలో న్యాయ పోరాటంలో మా ఈ చిన్న అడుగు విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్న ఎన్నో కుటుంబాలకు ధైర్యాన్నిస్తుంది. సుప్రీం కోర్టు ప్రకారం బెయిల్ అనేది పెండింగ్‌లో ఉన్న ఖైదీల హక్కు. అరవింద్ కేజ్రీవాల్ కోరిక మేరకు తన కొడుకుపై కేసు పెట్టారని అతని తల్లి చెప్పింది’’ అని జమై చెప్పుకొచ్చారు.
ఢిల్లీ అల్లర్లో హెడ్ కానిస్టేబుల్ దీపక్ దహియాకు గన్ గురిపెట్టిన కేసుతో పాటు రోహిత్ శుక్లా అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో షారుక్ పఠాన్ నిందితుడిగా ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆప్ తరుపున చౌదరి జుబేర్ అహ్మద్‌ని బరిలోకి దించగా, కాంగ్రెస్ అబ్దుల్ రెహ్మాన్‌ని ప్రకటించింది. బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. సీలంపూర్ సంప్రదాయంగా కాంగ్రెస్ కంచుకోట. అయితే గత రెండు సార్లు ఇక్కడ నుంచి ఆప్ గెలుపొందింది. అల్లర్ల కేసులో షారూక్ పఠాన్‌కి బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు అక్టోబర్‌లో నిరాకరించింది.