మహిళలపై అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పుడే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. తాజాగా డీఎంకేను ఉద్దేశించి అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
షణ్ముగం అసలేం మాట్లాడారంటే..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం నోటికి పని చెప్పారు. పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్టాలిన్.. ప్రజాదరణ పొందిన వాగ్దానాలతో పాటు ‘‘ఉచిత భార్య’’ను కూడా ప్రకటించవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ‘‘అడగకుండానే ఈపీఎస్ (ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) రూ. 2,500 ఇచ్చాడు. కానీ స్టాలిన్ అప్పుడు రూ. 5,000 డిమాండ్ చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాడా? లేదు. కానీ ఇప్పుడు.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అతను ల్యాప్‌టాప్, మినీ బస్సు, మిక్సీ, గ్రైండర్, పశువులు ఇస్తాడు. అవసరమైతే భార్యను కూడా ఇవ్వవచ్చు. ఉచిత భార్య పథకాన్ని కూడా ప్రకటించవచ్చు.’’ అని షణ్ముగం అభ్యంతర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Prashant Kishor: బిహార్ ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం!
ప్రస్తుతం షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. షణ్ముగం చేసిన వ్యాఖ్యలను డీఎంకే తీవ్రంగా ఖండించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ ధ్వజమెత్తింది. ఆ పార్టీ ప్రస్తుతం తిరోగమనం వైపు వెళ్తోందని మండిపడింది. తమిళనాడు సాంఘిక సంక్షేమ మంత్రి పి.గీతా జీవన్ తీవ్రంగా ఖండించారు. మహిళలను ఉచిత వస్తువులతో పోల్చడం వారిని అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. షణ్ముగం రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా…ప్రాథమిక మానవుడిగా కూడా అనర్హుడు అని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ 32వ బర్త్‌డే.. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేసిన ట్రంప్
డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. ‘‘21వ శతాబ్దంలో కూడా మహిళల పట్ల అన్నాడీఎంకే మనస్తత్వం ఇంత దారుణంగా ఉందా?, మహిళలను ఉచితంగా ఇవ్వవలసిన వస్తువులుగా చూస్తారా?, ఇది తిరోగమనం, ఆమోదయోగ్యం కాదు. పెరియార్, అన్నా సూత్రాలకు విరుద్ధం. వారి పేర్లను మోసుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇది సిగ్గుచేటు. తమిళనాడు మహిళలకు మంచిది కాదు. తమిళనాడులోని మహిళలను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను అవమానించాడు.’’ అని సయ్యద్ హఫీజుల్లా మండిపడ్డారు.
జయలలిత నాయకత్వం వహించిన పార్టీకి ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ వివాదంపై అన్నాడీఎంకే ఇంకా అధికారిక స్పందించలేదు. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎంపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ashley Tellis: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లిస్ అరెస్టు
