ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది, దివంగత చార్లీ కిర్క్ 32వ పుట్టిన రోజు సందర్భంగా అమెరికా అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారాన్ని ట్రంప్ అందజేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌కు మెడల్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆద్యంతం ఎరికా కిర్క్ దు:ఖపడుతూనే ఉన్నారు. ట్రంప్ దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి యూఎస్ టర్నింగ్ పాయింట్ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే బుల్లెట్ మెడలోకి దూసుకుని పోయి కుప్పకూలిపోయారు. మూడు రోజుల అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

2012లో యూఎస్ టర్నింగ్ పాయింట్‌ను చార్లీ కిర్క్ స్థాపించారు. ట్రంప్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చార్లీ కిర్క్ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ తరపున ప్రచారం నిర్వహించారు. ఇక చార్లీ కిర్క్ మరణం తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. గొప్ప అమెరికన్ హీరో కోల్పోయినట్లు తెలిపారు. స్వేచ్ఛ కోసం అమరవీరుడు అయ్యాడని కొనియాడారు. ఇక సంతాప సభలో ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. తన భర్తను చంపిన నిందితుడిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే అవార్డు ప్రదానం చేసేందుకు పశ్చిమాసియా పర్యటనను ముగించుకుని ట్రంప్ అమెరికాకు వచ్చేశారు. ‘‘ఈ కార్యక్రమాన్ని మరొక రోజుకు మార్చాలని ఎరికాకు ఫోన్ చేసి అడగాలని అనుకున్నా.. కానీ ధైర్యం చేయలేకపోయా. ఎందుకంటే మంగళవారమే చార్లీ కిర్క్ పుట్టినరోజు. అందుకే ఇజ్రాయెల్, ఈజిప్టు టూర్‌ను త్వరగా ముగించుకుని వచ్చేశాను. నేనెందుకు ఇంత త్వరగా వచ్చేశానంటే ఈరోజు చార్లీ పుట్టినరోజు అని తెలిసింది. అందుకే వచ్చేశా.’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇక ట్రంప్ రెండవ పదవీకాలంలో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి చార్లీ కిర్క్‌నే కావడం విశేషం. ఈ అవార్డు అమెరికా అత్యున్నత పురస్కారం. అవార్డును ట్రంప్ ప్రదానం చేస్తూ.. చార్లీ కిర్క్ మంచి యోధుడని ప్రశంసించారు. అమెరికన్ దేశభక్తుడిని గౌరవించడం, గుర్తుంచుకోవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. 1963లో అప్పటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను స్థాపించారు.