Tamil Nadu Politics: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు సీనియర్ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పి, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. నివేదికల ప్రకారం, కనీసం ఐదుగురు మాజీ మంత్రులు, 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది పార్టీ కార్యకర్తలు జూలై 2న మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో టీవీకేలో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది. టీవీకే విస్తరణలో ఇది కీలక ఘట్టంగా భావిస్తున్నారు.
టీవీకేలో చేరే అవకాశం ఉన్న ప్రముఖ నాయకులలో మాజీ మంత్రులు సి. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్, ఎం.ఎస్.ఎం. ఆనందన్, ఎస్. వలర్మతి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే, మాజీ కేంద్ర మంత్రి ఎం.కె. అళగిరి కుమార్తె కయల్విళి కూడా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏఐఏడీఎంకేలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ చేరికలు పార్టీకి పెద్ద దెబ్బగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా కరూర్, పుదుక్కోట్టై ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఎం.ఆర్. విజయభాస్కర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, సి. విజయభాస్కర్ ఇప్పటికే అసెంబ్లీ సభ్యత్వంతో పాటు ఏఐఏడీఎంకేకు కూడా రాజీనామా చేశారు. పార్టీ అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామిని ఉద్దేశించి ఎం.ఆర్. విజయభాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కార్యకర్తల అభిప్రాయాలను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ సంక్షోభంలో పడిందని ఆరోపిస్తూ, తీవ్ర భావోద్వేగంతో పార్టీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

