NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీ రియల్ “దేవదాస్”.. బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ రోజు పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని విపక్షాల భారీ స్థాయిలో సమావేశం జరుగబోతోంది. అయితే పాట్నాలో బీహార్ బీజేపీ మాత్రం రాహుల్ గాంధీకి విచిత్రమైన స్వాగతం పలికింది. పాట్నాలోని బీజేపీ కార్యాలయం ముందు రాహుల్ గాంధీ ‘రియల్ దేవదాస్’ అంటూ ప్లెక్లీని ఏర్పాటు చేసింది. ‘‘ కాంగ్రెస్ బెంగాల్ వదలాల్సిందిగా మమతా బెనర్జీ, ఢిల్లీ-పంజాబ్ వదలాల్సిందిగా కేజ్రీవాల్, బీహార్ వదిలిపెట్టాలని లాలూ-నితీష్, యూపీ వదలాల్సిందిగా అఖిలేష్ యాదవ్, తమిళనాడు విడిచిపెట్టాలని స్టాలిన్ కోరుతున్నారు. కాంగ్రెస్ ని రాజకీయాల నుంచి తప్పుకోవాలని అందరూ అడిగే రోజు ఎంతో దూరంలో లేదు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రీల్ దేవదాసు షారుఖ్ ఖాన్ అయితే.. రియల్ దేవదాస్ రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు.

Read Also: Titan: టైటాన్ ప్రమాదంపై స్పందించిన “టైటానిక్” దర్శకుడు

ఈ రోజు పాట్నాలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు 15 విపక్షాలు కలిసి ఐక్య కార్యచరణ రూపొందించేందుకు ఈ సమావేశం జరుగుతోంది. బీజేపీ గద్దె దించడమే టార్గెట్ గా విపక్షాలు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించాలని, ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు. పాట్నాలో నితీష్ కుమార్ 2024 ఎన్నికల కోసం పెళ్లి ఊరేగింపు సిద్ధం చేశారని.. అయితే పెళ్లి కొడుకు ఎవరు..? అందరూ తమను తాము ప్రధాని పోటీదారుగా భావిస్తున్నారని అన్నారు.

విపక్షాల సమావేశానికి దేశంలో 15 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ఖర్గే హాజరవ్వగా.. టీఎంసీ నుంచి మమతా బెనర్జీ, ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్, తమిళనాడు సీఎం స్టాలిన్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) నుంచి ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, సమాజ్ వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నుంచి లాలూ, తేజస్వీ యాదవ్ హాజరయ్యారు.